సిద్దిపేట, జనవరి 6(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పదవులు, పైసలు పోతే సంపాదించుకోవచ్చు కానీ మాటజారితే వెనక్కి తీసుకోలేమని, మాట జారి ఎదుటి వారి మనసు విరిగేలా చేస్తే మళ్లీ అతికించడం కష్టమని, అందుకే మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు సూచించారు. సిద్దిపేట నియోజకవర్గంలో ఎన్నికైన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లకు మంగళవారం సిద్దిపేటలోని రెడ్డి సంక్షేమ భవన్లో ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, రాష్ట్ర నాయకులు వేలేటి రాధాకృష్ణ శర్మ, కడవేర్గు రాజనర్సు, ఇతర సీనియర్ నాయకులతో కలిసి హరీశ్ మాట్లాడుతూ సర్పంచ్‌లు గ్రామంలో ప్రజల మధ్య ఉండి వారి కష్ట సుఖాల్లో ముందుండాలని చెప్పారు. పదవి అంటే అధికారం కాదని, బాధ్యత అని స్పష్టంచేశారు. ‘పదవులు రాగానే మనం పొంగిపోవద్దు.. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలె. అందర్నీ కలుపుకొని గ్రామాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలె. అప్పుడే ప్రజల మన్ననలు పొందుతాం. మరిన్ని ఉన్నత పదవులు పొందుతాం’ అని హితవుపలికారు. ‘కేసీఆర్‌కు భుజంలా ఉంటూ రాష్ట్ర స్థాయి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే సిద్దిపేటలో వారంలో మూడు రోజుల పాటు మీతోనే ఉంటాను’ అని సర్పంచ్‌లకు, పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ‘హాస్పిటల్, పోలీస్‌స్టేషన్ సమస్య అయినా వాట్సాప్‌లో ఒక్క మెసేజ్ చేయండి. నేను చూసుకుంటా. మనమంతా కుటుంబంలా కలిసి ముందుకు సాగుదాం’ అని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లుగా పంచాయతీ ఎన్నికలు జరపక.. గ్రామాలకు రూపాయి కూడా ఇవ్వలేదు. రేవంత్ పాలనా వైఫల్యం, పట్టింపులేనితనంతో గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయినయ్. కేసీఆర్ ప్రభుత్వంలో ఏ ఊరు చూసినా ముత్యంలా మెరిసిపోయేది. రేవంత్ పాలనలో పల్లెలు మురికి కూపంలా మారినయ్.
-హరీశ్‌రావు
బీఆర్ఎస్ హయాంలో దేశంలోనే తెలంగాణ పల్లెల పేర్లు లేకుండా అవార్డులు లేవని, మెజారిటీ అవార్డులు తెలంగాణ పల్లెలకు వచ్చాయని హరీశ్ గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి వచ్చాక రెండేండ్లల్లో పల్లెలకు అవార్డులు మాయమైపోయాయని ఎద్దేవాచేశారు. నాడు ఆదర్శంగా ఉన్న గ్రామాలు నేడు అధ్వానంగా మారాయని వాపోయారు. రేవంత్‌రెడ్డి గ్రామాలను పూర్తిగా పంచాయతీ కార్యదర్శుల మీద వదిలేశారని తెలిపారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి వారు ఇబ్బందులు పడ్డారని, వారిని కూడా తప్పు పట్టలేమని చెప్పారు. ‘పాపం ఆ పంచాయతీ కార్యదర్శులు వచ్చే జీతాలకు తోడుగా బయట అప్పులు తెచ్చి గ్రామాలకు పెట్టారు’ అని వాపోయారు. ఈ రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో ట్రాక్టర్లలో ఆయిల్ కూడా మార్చలేక పోయారని, కనీసం సర్వీసింగ్ చేయించలేదని, డీజిల్ కూడా పోయించలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలోని రెండేండ్ల చెత్త అంతా కొత్త సర్పంచ్ల మీద పడిందని, అంతా బాగు చేయాల్సిన బాధ్యత కొత్త సర్పంచ్‌లపై పడిందని చెప్పారు. ‘మీకు గ్రామాలు సమస్యల స్వాగతం పలుకుతున్నయి. వాటిని అధిగమించడం ఒక చాలెంజ్.. అట్లా అని అధైర్య పడవద్దు. ప్రతి దానికీ పరిష్కారం ఉంటది. మనం కట్టిన పన్నులే మనకు వస్తయి తప్ప డిల్లీ వాళ్లు ఇచ్చేదేం ఉండదు. మనకు రావాల్సిన డబ్బులే వాళ్లు ఇస్తున్నరు. రెండేండ్లుగా ఆగిపోయిన డబ్బులు గ్రామాలకు వస్తయి. పంచాయతీలో జనాభా ప్రతిపాదికన నేరుగా జీపీ ఖాతాలోనే జమ అవుతయి’ అని వివరించారు.
కేసీఆర్ ప్రభుత్వం నెలనెలా గ్రామాలకు పల్లె ప్రగతి నిధులు ఇచ్చిందని హరీశ్ గుర్తుచేశారు. ఈ నిధులతో గ్రామాల్లో ఇబ్బందుల్లేకుండా అన్ని పనులూ చేసుకొని ఆదర్శ గ్రామాలుగా చేసుకున్నామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రతి పల్లెకూ ఒక ట్రాక్టర్, డోజర్, వాటర్ ట్యాంకర్, ట్రాలీ ఇచ్చిందని చెప్పారు. కేసీఆర్ దీవెనలతో అన్ని రంగాల్లో సిద్దిపేటను అభివృద్ధి చేసుకున్నామని, కాళేశ్వరం జలాలు సిద్దిపేటను ముద్దాడిన తర్వాత ఈ ప్రాంత రూపు రేఖలు మారిపోయాయని తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గంలో నాడు యసంగి పంట ఎనిమిది వేల ఎకరాల్లో సాగైతే.. నేడు 80 వేల ఎకరాల్లో సాగవుతున్నదని చెప్పారు. అది కాళేశ్వరం జలాలతోనే సాధ్యమైందని స్పష్టంచేశారు. ‘రేవంత్‌రెడ్డి కాళేశ్వరం కూలిందని మాట్లాడుతున్నడు.. మరి ఈ నీళ్లు ఎక్కడివి?’ అని ప్రశ్నించారు. కాళేశ్వరం వల్లే మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మ, గంధమల్ల రిజర్వాయర్లు నేడు నిండుకుండల్లా ఉన్నాయని చెప్పారు.
పదవి అంటే అధికారం కాదు.. బాధ్యత. పదవులు రాగానే పొంగిపోవద్దు.. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలె. అందర్నీ కలుపుకొని గ్రామాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలె. అప్పుడే ప్రజల మన్ననలు పొందుతం. మరిన్ని ఉన్నత పదవులు సాధిస్తం.
-హరీశ్‌రావు
గ్రామ సర్పంచ్‌గా గెలువడం పెద్ద చాలెంజ్ అని హరీశ్ తెలిపారు. ‘పార్టీల మీద ఎన్నికలు జరిగితేనే కొంత గుర్తు మీద గెలిచే అవకాశం ఉంటది. గ్రామాన్ని ఎవరైతే కాపాడగలుగుతారో వాళ్లనే ప్రజలు గెలిపిస్తరు.. ఆ నమ్మకంతోని మిమ్మల్ని అందరినీ గెలిపించారు. ఆ నమ్మకాన్ని కాపాడుకోవాలి’ అని సూచించారు. ‘మనం ప్రతిపక్షమా? అధికార పక్షమా? అనేది కాదు.. మనం ప్రజల పక్షం’ అని స్పష్టం చేశారు. ప్రజలతో కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు.