కాంగ్రెస్ సర్కారు నిర్వాకంతో మహిళలు కోటీశ్వరులేమోగాని..అప్పులపాలయ్యే పరిస్థితి వచ్చింది. అధికారంలోకి రాగానే ప్రతి మహిళకు నెలకు రూ.2500 ఇస్తామని మొదటి గ్యారెంటీగా హామీ ఇచ్చి మొదటికే మోసం చేసింది. రేవంత్ మాటలు కోటలు దాటితే చేతలు మాత్రం గడపదాటడం లేదనేది మరోసారి నిరూపితమైంది. మహాలక్ష్మి కింద ప్రతి మహిళకు బాకీపడ్డ రూ.37,500 ఎప్పుడు చెల్లిస్తరు?
– హరీశ్‌రావు
హైదరాబాద్, మార్చి 8 (నమస్తేతెలంగాణ): మహిళలను కోటీశ్వరులను చేస్తామని కోతలు కోసిన సీఎం రేవంత్‌రెడ్డి ఏడాదిన్నర ఇందిరమ్మ పాలనలో ఎడతెగని వేదనే మిగిల్చారని మాజీ మంత్రి హరీశ్ ధ్వజమెత్తారు. మహిళలను కోటీశ్వరులను చేయడం దేవుడెరుగు కనీసం లక్షాధికారులను కూడా చేయలేని చేతగారు సర్కారు ఇదని నిప్పులు చెరిగారు. ఏడాదిన్నరలో ఏం ఉద్ధరించారని మహిళాశక్తి పేరిట ఉత్సవాలు చేస్తున్నారని శనివారం ఎక్స్ వేదికగా నిలదీశారు. 6 గ్యారెంటీలు, 420 హామీలతో రేవంత్‌రెడ్డి సర్కారు అన్నివర్గాల ప్రజలను వంచించిన తరహాలోనే మహిళలను కూడా దారుణంగా మోసం చేసిందని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా మహిళా సాధికారత, స్వయం సమృద్ధి కోసం కేసీఆర్ తెచ్చిన పథకాలకు కూడా మంగళం పాడిందని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంలో కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, బతుమ్మ చీరలు, ఆరోగ్యలక్ష్మి, పింఛన్ల పెంపు ఏమయ్యాయని ప్రశ్నించారు. ‘నాడు తగ్గిపోయిన కడపు కోతలు నేడు తిరిగి మొదలైనయి.. పెరిగిన క్రైమ్రేటుతో ఆడబిడ్డలకు భద్రత కరువైంది.
నోటిఫికేషన్లు రాక యువతుల ఉద్యోగాల కల సాకారం ప్రశ్నార్థకమైంది’ అంటూ ఆందోళన వ్యక్తంచేశారు. మ్యానిఫెస్టోలో చెప్పిన హామీలు అమలు చేయకుండా కాలం వెళ్లదీసిన ప్రభుత్వం ఇప్పుడు ఏదో ఉద్ధరించినట్టు, మహిళలను కోటీశ్వరులను చేసినట్టు కోట్లు వెచ్చించి అబద్ధాలు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని ఫైర్అయ్యారు. ‘అభయాస్తం మ్యానిఫెస్టో ప్రకారం 18 ఏండ్లు పైబడి, చదువుకునే ప్రతీ యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామన్నా హామీ ఊసే మరిచారు..ఆడబిడ్డ పెండ్లికి రూ. లక్షతో పాటు తులంబంగారం పథకం జాడేలేకుండా పోయింది. మహిళా పారిశ్రామిక వేత్తల నైపుణ్యాభివృద్ధికి ఇవ్వాల్సిన నిధి పత్తాలేదు..డ్వాక్రా సంఘాలకు పక్కా భవనాల ప్రస్తావనేలేదు.. పుట్టిన ఆడబిడ్డకు ఆర్థిక సాయం అందించే పథకాన్ని పునరుద్ధరిస్తామని చెప్పిన మాటలకు విలువేలేదు.. అంగన్వాడీల వేతనాలను రూ.18,000కు పెంపు, ఈపీఎఫ్ పరిధిలోకి తెచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తామన్న హామీ నీటి మూటలైంది.. ఆశా కార్యకర్తల వేతనాల పెంపుపై సర్కారుకు సోయేలేదు..’ అంటూ హరీశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇచ్చిన హామీలను మరిచిన సర్కారు ‘నవ్విపోదురు గాకా నాకేంటి సిగ్గు’ అన్న చందంగా మహిళా దినోత్సవాలు ఆర్భాటంగా నిర్వహించడం రేవంత్ సర్కారుకే చెల్లిందని దెప్పిపొడిచారు. ‘ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది. లైంగిక దాడులు, హత్యలు నిత్యకృత్యమయ్యాయి. మహిళలపై నేరాలు, మహిళా రైతుల బలవన్మరణాలు పెరిగిపోతున్నాయి. గురుకులాల్లో విద్యార్థినుల ఆత్మహత్యలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి..’అంటూ ఆందోళన వ్యక్తంచేశారు. రేవంత్ పాలనలో మహిళల భద్రత మాటలకే పరిమితమైందని దుయ్యబట్టారు. ఈ సర్కారుకు మహిళల అభ్యున్నతిపై చిత్తశుద్ధి ఉంటే వారికి ఇచ్చిన హామీల అమలు తేదీలను ప్రకటించాలని, లేదంటే చేతగాదని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఏటా రూ.20 వేల కోట్ల చొప్పున ఐదేండ్లలో రూ.5 లక్షల వడ్డీలేని రుణాలిస్తామని ముఖ్యమంత్రి ఊదరగొట్టిండ్రు. ఈ ప్రభుత్వం మహిళలకు బకాయిపడ్డ రూ.5 వేల కోట్లు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నది. ఏడాదిన్నరలో ఏం ఉద్ధరించారని మహిళాశక్తి పేరిట ఉత్సవాలు నిర్వహిస్తున్నరు?
– హరీశ్‌రావు
తెలంగాణ అప్పులు ఏడు లక్షల కోట్లని ముఖ్యమంత్రి పదేపదే శుద్ధ అబద్ధాలు చెప్తూ దివ్యంగా ఉన్న రాష్ర్టాన్ని దివాలా తీసిందని తెలంగాణ ప్రతిష్ఠను దిగజార్చుతున్నారని హరీశ్ ధ్వజమెత్తారు. రాష్ట్ర రుణాలు రూ.4.17 లక్షల కోట్లేనని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతోపాటు ప్రజలకు వివరించానని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరవుతున్నా ఇంకెన్నాళ్లు అప్పులను సాకుగా చూపుతూ తప్పించుకు తిరుగుతారని నిలదీశారు. ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పినంత మాత్రాన నిజమైపోదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవుపలికారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అసత్య ప్రచారం చేయడం బాధాకరమని హరీశ్‌రావు పేర్కొన్నారు.