హైదరాబాద్, మార్చి 29(నమస్తే తెలంగాణ): ‘లేని కమిటీ ఉన్నట్టుగా ఊహించుకొని ఆ కమిటీ పరిశీలనకు ఓ అంశాన్ని సిఫార్సు చేయడం కాంగ్రెస్ సర్కార్‌కు, సీఎం రేవంత్‌రెడ్డికే చెల్లింది’ అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ప్రస్తుతం అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ లేదు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేండ్లు అవుతున్నా ఇప్పటివరకు ప్రభుత్వం ఆ కమిటీనే నియమించలేదు. ఆ కమిటీ లేదనే విషయం సీఎం రేవంత్‌రెడ్డికి తెలియకపోవడం గమనార్హం. దీంతో ఆదివారం అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వివాదాన్ని ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేస్తున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
దీంతో వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పందిస్తూ.. అసలు ఎథిక్స్ కమిటీయే లేదు.. అలాంటప్పుడు లేని కమిటీకి ఎలా సిఫార్సు చేస్తారంటూ చురకలంటించారు. దీంతో కంగుతిన్న సీఎం రేవంత్‌రెడ్డి.. అసలు విషయం తెలుసుకొన్న తర్వాత ఎథిక్స్ కమిటీ వేస్తామని ప్రకటించడం గమనార్హం. ఇలా సభా నాయకుడిగా ఉంటూ సభలో ఏ కమిటీ ఉన్నదో? ఏ కమిటీ లేదో? తెలియకుండా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ విషయం తెలుసుకోకుండానే ఆ కమిటీకి సిఫార్సులు చేయడం ఏమిటని, అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నదో వారికైనా అర్థమవుతుందా? అంటూ రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.