హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): గురుకుల విద్యార్థులు ఎలుకలు కరిచి దవాఖానల పాలవుతుంటే సీఎం ఏం చేస్తున్నారంటూ మాజీమంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలన ఎట్లుందో చెప్పడానికి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న గురుకులాలే నిదర్శనమన్నా రు. మొన్న రామాయంపేట గురుకుల పాఠశాలలో 12మంది విద్యార్థుల మీద, నిన్న నల్లగొండ జిల్లాలోని కొండభీమనపల్లి గురుకుల పాఠశాలలో 13 మంది విద్యార్థుల మీద ఎలుకల దాడి చేశాయని గురువారం ఎక్స్ వేదికగా హరీశ్ తెలిపారు. పాముకాటుకు గురై విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారని, కలుషిత ఆహారం తిని, ఎలుకల కాటుకు గురై దవాఖానల పాలవుతున్నారని పేర్కొన్నారు. 8 నెలల కాలంలో 500 మం ది పైగా గురుకుల విద్యార్థులు దవాఖానల పాలయ్యారని, 36 మంది విద్యార్థులు ప్రా ణాలు కోల్పోయారని ఆందోళన వ్యక్తంచేశారు. విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న రేవంత్‌రెడ్డే బాధ్యుడని స్పష్టం చేశారు.