సిద్దిపేట, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ అధికారంలోకి వచ్చేది లేదు. వాళ్లు ప్రజలకు చేసేదేమీ లేదు. వాళ్లను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్టే. వాళ్ల హామీలకు హద్దుల్లేవు. ఒక్కటీ నెరవేర్చరు. వారు పాలిస్తున్న రాష్ర్టాల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క టీ అమలు చేయడం లేదు. వారి జూఠా మాటలు నమ్మవద్దు’.. అని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. మంగళవారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ఆర్అండ్ఆర్ కాలనీ ప్రజలతోపాటు సిద్దిపేట నియోజకవర్గ ముఖ్యకార్తల సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఆ పార్టీలపై ప్రజ ల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని చెప్పారు. మనకు పెద్దదిక్కుగా ఉన్న సీఎం కేసీఆర్‌ను గజ్వేల్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిపించుకుందామని, హ్యాట్రిక్ సీఎంగా చేద్దామని పిలుపునిచ్చారు.
అభివృద్ధిని ఓర్వలేక పోతున్న ప్రతిపక్షాలకు ఓటు అడిగే నైతికహక్కు లేదని హరీశ్‌రావు పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఉపాధి కోసం బొం బాయి, బొగ్గుబాయి, దుబాయికి వలసలు పోయారని, ఇప్పుడు సీఎం కేసీఆర్ వల్ల ఆ పరిస్థితులు లేవని తెలిపారు. తెలంగాణలో రైతులకు 24 గంటల కరెంటు ఇస్తుంటే పొరుగున ఉన్న కర్ణాటకలో 5 గంటలే ఇస్తున్నారని వివరించారు. గ్రామాల్లోనే కాంటాలు పెట్టి చివరిగింజ వరకు కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. వారం పది రోజల్లోనే రైతుల ఖాతాలో ధాన్యం డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు. రైతుబంధు సృష్టికర్త సీఎం కేసీఆర్ ఇకపై ఎకరాకు రూ.16 వేలు ఇస్తామని చెప్పారని గుర్తుచేశారు. గజ్వేల్ పట్టణ అభివృద్ధికి బృహత్ ప్రణాళిక ఉన్నదని వెల్లడించారు. కేసీఆర్ గజ్వేల్ రూపురేఖలు మార్చారని, రాబోయే రోజుల్లో ఎంతో అభివృద్ధి చేయబోతున్నామని చెప్పారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను గడప గడపకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. గజ్వేల్‌లో లక్షకుపైగా మెజారిటీతో కేసీఆర్‌ను గెలిపించుకుంటామని ముక్తకంఠంతో నాయకులు, కార్యకర్తలు చెప్పారు.
దుబ్బాకలో కొత్త ప్రభాకర్‌రెడ్డికి మనమంతా అండగా ఉందామని కార్యకర్తలకు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఎంపీపై హత్యా ప్రయత్నం కలిచి వేసిందని చెప్పారు. ఈ సమయంలో ప్రభాకర్‌రెడ్డికి అండగా ఉండి, ప్రతి కార్యకర్త ఆయన గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట, గజ్వేల్ గెలుపు ఎంత ముఖ్యమో దుబ్బాకలో ప్రభాకర్‌రెడ్డి గెలుపు అంతే ముఖ్యమని చెప్పారు. దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచిన రఘునందన్‌రావు ఏం చెప్పిండో అక్కడి నియోజకవర్గ ప్రజలకు తెలుసునని, ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు.