Nadargul Lands | బాంబులభాషలో మాట్లాడే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటికి సంబంధించి భారీ భూకుంభకోణం మందుపాతరలా పేలింది. నాదర్గుల్లో అక్రమాల డొంక కదిలింది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని.. ఏకంగా 373 ఎకరాల ప్రభుత్వ భూమినిచెరపట్టిన ఉదంతం విస్తుగొల్పుతున్నది.
దశాబ్దాలుగా ప్రభుత్వాలు కాపాడుకుంటూ వచ్చిన ఆ భూమిని ఆక్రమించడం.. నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ కబ్జా చేయడం.. హక్కుదారులైన రైతులనూ వెళ్లగొట్టడం.. పోలీసులు, బౌన్సర్లతో బెదిరింపులకు దిగడం.. గుట్టలు, చెరువుల్నీ వదలకుండా చెరపట్టడం.. అందుకోసం అనేక కంపెనీల ముసుగులో అడ్డదారులు తొక్కడం.. తీగలాగుతున్నకొద్దీ డొంక కదులుతున్నది.ఇది రూ.7 వేల కోట్ల భారీ భూ స్కామ్! ఏకంగా సర్కార్‌లోనే పేలిన ల్యాండ్‌మైన్!
హైదరాబాద్, ఏప్రి ల్ 5 (నమస్తే తెలంగాణ) : నాదర్గుల్లోని విలువైన భూములపై ప్ర భుత్వ పెద్దల కన్ను పడిందని, హైదరాబాద్ నడిబొడ్డున 7 వేల కోట్ల ల్యాండ్ స్కామ్‌కు తెరలేపారని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు సంచలన ఆరోపణలు చేశారు. రక్షకులే భక్షకులుగా మారి గద్దల్లా తన్నుకుపోతున్నారని, స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి కుమారుడే విలువైన భూములను చెరబడుతున్నారని, గుట్టలను సైతం మింగేస్తున్నారని, చెరువును కబ్జాపెడుతున్నారని ఆధారాలతో బయటపెట్టారు.
కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత దళితులు, బలహీన వర్గాల భూములను అధికార పార్టీ పెద్దలు గద్దల్లా తన్నుకుపోతున్నారని మండిపడ్డారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్లు దండుకుంటున్నారని నిప్పులు చెరిగారు. ఓవైపు ఎస్సీ, ఎస్టీలకు పట్టాల పేరిట భూసేకరణ చేయడం, మరోవైపు పారిశ్రామికవేత్తల ముసుగులో, ఇంకోవైపు కబ్జాల రూపంలో కాంగ్రెస్ సర్కార్ అనేక భూ కుంభకోణాలకు పాల్పడుతున్నదని విరుచుకుపడ్డారు. నాదర్గుల్లోని సర్వే నంబర్ 613 (కొత్త సర్వే నంబర్ 119) లో ఉన్న 373 ఎకరాల్లో రూ.7 వేల కోట్ల భారీ సామ్ జరుగుతున్నదని, దీని వెనుక ప్రభుత్వ పెద్దలు, మంత్రులున్నారని చెప్పారు. బాధిత రైతులతో కలిసి తెలంగాణ భవన్లో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించి భూ బాగోతం వివరాలను హరీశ్ వెల్లడించారు. భూకబ్జాలో కంపెనీలు, మంత్రి కుటుంబసభ్యుల పాత్రను ఆధారాలతో వివరించారు.
నాదర్గుల్లోని 373 ఎకరాల భూములపై చాలా ఏండ్లుగా పోరాటం జరుగుతున్నదని, ఆ భూములు తనవేనని, నిజాం నుంచి తనకు సంక్రమించినట్టు శివరాజ్ బహదూర్ అనే వ్యక్తి క్లెయిమ్ చేయగా, దానిపై కోర్టులోనూ అనేక వివాదాలు నడిచాయని హరీశ్‌రావు గుర్తుచేశారు. 2005లోనే అప్పటి ఆర్డీవో అది ప్రభుత్వ భూమని స్పష్టంచేశాని చెప్పారు. నాదర్గుల్లోని ప్రభుత్వ భూమిని కొందరు కబ్జాపెడుతున్నారని, కాపాడాలని 2007లో ప్రతిపక్షనాయకుడి హోదాలో చంద్రబాబునాయుడు నాటి సీఎం వైఎస్సార్‌కు లేఖరాశారని, స్థలం వద్దకు వెళ్లిపోరాటం చేశారని గుర్తుచేశారు. 2008లో నాటి వైఎస్సార్ ప్రభుత్వం ఆ స్థలాన్ని సర్కార్ భూమిగా ప్రకటించడమేగాక, తెలంగాణ మౌలిక వసతుల కల్పన సంస్థకు అప్పగించిందని, కొంత స్థలాన్ని యూనిటెక్ అనే కంపెనీకి కేటాయించిందని వివరించారు.
ఆ భూములను పదేండ్ల పాటు కేసీఆర్ ప్రభు త్వం రక్షించిందని తెలిపారు. కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆ భూములను భక్షిస్తున్నదని, అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే భూ కబ్జాకు తెరలేపిందని నిప్పులుచెరిగారు. 373 ఎకరాల భూమి మీద 600 మంది పేద రైతులు బతుకుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ వచ్చాక రైతులను వారి భూముల్లోకి పోనివ్వకుండా బౌన్స ర్లు, పోలీసులను పెట్టి దాడులు చేయిస్తూ, అక్రమ కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. చాలామంది రైతులు బీఆర్ఎస్ ఆఫీసుకు వచ్చి ఆవేదన వెళ్లగక్కారని, అక్కడి ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఎదుట గోడు వెళ్లబోసుకున్నారని వివరించారు. నాటి కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం పేదలకు వ్యవసాయం కోసం అవకాశమిస్తే.. నేటి రేవంత్ రాజ్యం గూండాలను పెట్టి భూములను గుంజుకుంటున్నదని నిప్పులుచెరిగారు.

వైఎస్సాఆర్ నాదర్గుల్ భూములను ప్రభు త్వ భూములను ప్రకటించగా, దాన్ని సవాల్ చేస్తూ శివరాజ్ బహదూర్ కోర్టును ఆశ్రయించి ఆర్డర్ తెచ్చుకున్నారని హరీశ్ వెల్లడించారు. అప్పుడే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద చట్టం వచ్చిందని, దాని ప్రకారం ఒక వ్యక్తికి 373 ఎకరాలు ఉండే అవకాశమే లేదని తేల్చిచెప్పారు. చట్టం ప్రకారం శివరాజ్ బహుదూర్, ఆయన కుటుంబీకులు తొలుత ఆర్డీవో వద్దకు వెళ్లి ఆ భూమిలో తమకు తలోకొంత వస్తదని, మిగిలినది ప్రభుత్వం తీసుకోవాలని డిక్లేర్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. అయితే శివరాజ్ బహదూర్, వారి కుటుంబీకులు ఆర్డీవో వద్దకు, ల్యాండ్ ట్రిబ్యునల్ వద్దకు వెళ్లకుండా 2016లో ఆల్ఫా, ఒమేగా, యునైటెడ్ అనే కంపెనీలకు 50 ఎకరాల చొప్పున విక్రయించారని వెల్లడించారు. భూమిని కొనుగోలు చేసిన ఆ మూడు కంపెనీలవారు ఆర్డీవో దగ్గరకు వెళ్తే ఆ భూమి అమ్మడం నేరమని, దాన్ని నిషేధిత జాబితాలో పెట్టారని తెలిపారు. ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ ఇవ్వకుండా ఆ భూములను అమ్మే హకు రాజ్ బహదూర్‌కు లేదని, విక్రయాలు చెల్లబోవని ప్రకటించారని గుర్తుచేశారు.
సెక్షన్ 22ఏ కింద ఆ భూముల ను నిషేధిత జాబితాలో చేర్చారని, ఆర్డీవో నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సదరు కంపెనీలు హైకోర్టుకు వెళ్లగా 2020, ఫిబ్రవరి 12న హైకోర్టు ఆర్డీవో నిర్ణయమే సరైనదని, ఆ క్రయవిక్రయాలు చెల్లబోవని సింగిల్ బెంచ్ తీర్పునిచ్చిందని, అమ్మిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు సూచించిందని తెలిపారు. అదే విషయంపై హైకోర్టు డివిజన్ బెంచ్ 2022, అక్టోబర్ 13న ఆర్డీవో, సింగిల్ బెంచ్ తీర్పులు సరైనవని, ఈ భూములు ప్రభుత్వ భూములని, ఆ భూములను 22ఏ కింద చేర్చ డం సరైన చర్యేనని తీర్పు ఇచ్చిందని చెప్పారు. పేరా 12లో ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ సెక్షన్ 17 కింద సీలింగ్ డిక్లరేషన్ ఇవ్వకుండా, ట్రిబ్యునల్ ఆర్డర్ లేకుండా భూములు అమ్మితే అవి చిత్తుకాగితాలతో సమానమని డివిజన్ బెంచ్ తీర్పునిచ్చిందని, హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ ఆ కంపెనీల వాళ్లు 2023, సెప్టెంబర్ 2న సుప్రీంకోర్టుకు వెళ్లారని, దానిపై సుప్రీం కోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదని వివరించారు.
నాదర్గుల్ భూములు ప్రభుత్వానివేనని, రాజ్ బహదూర్‌కు విక్రయ హక్కుల్లేవని సుప్రీంకోర్టులో కందుకూరు ఆర్డీవో ఆఫిడవిట్ దాఖలు చేశారని, వాదనలు వినిపించారని వెల్లడించారు. సుప్రీంకోర్టు ఎలాంటి స్టే, లేదా ఆదేశాలు ఇవ్వనందున ఇప్పటికీ హైకోర్టు ఆదేశాలు, ఆర్డీవో ఉత్వర్వులే ఫైనల్ అని గుర్తుచేశారు. భూమికి సంబంధించిన ఈ వాస్తవాలను దాచిపెడుతున్న ప్రస్తుత గద్దలు సుప్రీంకోర్టు తీర్పును అనుకూలంగా చూపుతూ కబ్జాకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. కానీ సుప్రీంకోర్డు తీర్పు తర్వాత ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చిందని గుర్తుచేశారు. చట్ట ప్రకారం ఆ భూమిలో ఎవరైనా కౌలు చేసుకుంటే 38(ఈ) సెక్షన్ కింద పాస్ బుక్కులివ్వాలని, ఆ రైతులకు కూడా ఏడేండ్ల వరకు ఆ భూములను విక్రయించే హక్కు ఉండబోదని తెలిపారు. తద్వారా ఇప్పుడు గద్దలు రైతులకు రూ.3 లక్షలు, 4 లక్షలు ఇస్తూ రాయించుకుంటున్న కాగితాలేవీ చెల్లబోవని, చివరికి శివరాజ్ బహదూర్ కూడా విక్రయించింది కూడా చెల్లదని, ఇవన్నీ చెల్లని కాగితాలేనని స్పష్టంచేశారు.
ఈ క్షణం భూభారతి వెబ్సైట్లో చూసినా అది ప్రభుత్వ భూమి (ప్రొహిబిటెడ్ ల్యాండ్) గానే చూపిస్తున్నదని హరీశ్ వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్లో పాత సర్వేనంబర్ 613/ కొత్త సర్వే నంబర్ 119 అని ఉన్నదని వివరాలను బహిర్గతం చేశారు. అలాంటప్పుడు తమ భూమి అంటూ కంపెనీలు బోర్డులు ఎలా పెడుతాయని ప్రశ్నించారు. ‘సుప్రీంకోర్టు కేసు పెండింగ్‌లోనే ఉన్నది. దానిపై నేటికీ సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. అంటే హైకోర్టు జడ్జిమెంట్ ‘స్టాండ్స్ గుడ్’ అని భావించాలి. ఆర్డీవో దానికి కస్టోడియన్‌గా భావించి ఆ భూమి ప్రభుత్వ భూమిగానే భావించాలి. సీలింగ్యాక్ట్ సెక్షన్ 17 ప్రకారం ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ లేకుండా భూములు అమ్మరాదు, ఎక్స్చేంజ్ చేసుకోరాదు, గిఫ్ట్‌గా ఇవ్వరాదు. ఒక వేళ తీసుకున్నా చిత్తుకాగితంతో సమానం’ అని వెల్లడించారు. సెక్షన్19 ప్రకారం రిజిస్ట్రేషన్, సేల్ డీడ్స్ చేసుకున్నా చెల్లబోవని, డిక్లరేషన్ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుందని వివరించారు. కోర్టు తీర్పులు, చట్టాలు ఉన్నా కస్టోడియన్‌గా ఉండి భూములను కాపాడాల్సిన కందుకూరు ఆర్డీవో కండ్లు మూసుకున్నారని మండిపడ్డారు.
నాదర్గుల్ భూములను పెద్దలు కబ్జాపెట్టారని, బౌన్సర్లు, గూండాలు భూముల్లోకి వెళ్లనివ్వడంలేదని మార్చి 9న కందుకూరు ఆర్డీవోకు బాధిత రైతులు దరఖాస్తు చేశారని, అదే రోజున కందుకూరు ఎమ్మార్మో, రంగారెడ్డి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారని తెలిపారు. ‘భూముల్లోకి వెళ్లనివ్వడంలేదు. గూండాలు కబ్జాపెడుతున్నరు. అక్రమంగా గోడలు కడుతున్నరు.. రేకులు పెడుతున్నరు. ఫెన్సింగ్ వేస్తున్నారని హైడ్రాకు మార్చి10న ఫిర్యాదు చేసిండ్రు’ అని సంబంధిత పత్రాలను హరీశ్ ప్రదర్శించారు. ఆ భూములపై రిజిస్టర్డ్ డీడ్, సేల్ అగ్రిమెంట్ చూపించి ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేస్తుంటే కాపాడాల్సిన ఆర్డీవో, హైడ్రా అధికారులు ఎందుకు కండ్లు మూసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘నా కుటుంబసభ్యులు తప్పు చేసినా, రెవెన్యూ మంత్రి తప్పు చేసినా ఎవ్వర్నీ వదలబోను’ అని అసెంబ్లీలో సీఎం అన్నడు. మరెందుకు హైడ్రా ఇక్కడ కండ్లు మూసుకున్నది? ఇది ప్రభుత్వ భూమే కదా! నచ్చితే నజరానా లేదంటే జరిమానానా? పేదవాడికో న్యాయం పెద్దోడికో న్యాయమా?’ అని నిలదీశారు. ‘కోర్టు సెలవులు ఉండే శని, ఆదివారాల్లో పోయి మరీ పేదల ఇండ్లు కూల్చుతున్న హైడ్రాకు 373 ఎకరాల భూమిని కాపాడేందుకు మనసు ఎందుకు వస్తలేదు?’ అని ప్రశ్నించారు. ‘అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి డైలాగులు కొట్టిండు.. మరి వీళ్లను ఎందుకు వదిలిపెడుతున్నడు? ఈ 7వేల కోట్ల వెనుక రేవంత్‌రెడ్డి ఉన్నడు కాబట్టే వదిలిపెడుతున్నడు’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో గూండాలు, బౌన్సర్లు, రౌడీలు రాలేదు. కంపెనీలు ఆ భూముల మీదికి వచ్చే ధైర్యం చేయలేదు? ఆ భూములు అమ్మినోడు కూడా కేసీఆర్ ఉన్నప్పుడు రాలేదు? బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి రేవంత్‌రెడ్డి రాగానే ఈ కబ్జాకోరులు, గూండా లు ఎందుకు వస్తున్నరు? దీని వెనుక ప్రభుత్వ పెద్దలే దొంగలు’ అని హరీశ్ ఘాటుగా స్పందించారు. ‘నాదర్గుల్ భూముల్లో మొద ట రేకులు పెట్టారు.. ఆ తర్వాత గ్రానైట్ రాళ్లతో ప్రహరీ కట్టారు. వెంటనే రైతులు ఆందోళనకు దిగి అడ్డుకుంటే ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చినయ్. అల్లరల్లరి అవుతుంటే అప్పుడు గోడ కట్టడం ఆపిండ్రు’ అని చెప్పారు. అక్కడ గేట్లు, తాళా లు, బౌన్సర్లను పెట్టి కాపలా కాస్తున్నారని, రైతులకు సాయం చేయాల్సిన పోలీసులు గూండాలకు వత్తాసు పలుకుతున్నారని నిప్పు లు చెరిగారు. ‘ఆ భూముల చుట్టూ ఫెన్సింగ్, ఆ ల్యాండ్ ఫలానా వారిదని రోజుకో బోర్డు వెలుస్తున్నది. రక్షకుడే భక్షకుడు అవుతున్నడు. సాక్షాత్తూ రెవెన్యూ మంత్రే ఈ భూముల కబ్జాల వెనుక ఉన్నడు’ అని తేల్చిచెపారు.
‘ఈ 373 ఎకరాల మధ్యలో లచ్చమ్మకుంట చెరువు ఉన్నది. దాని ఎఫ్టీఎల్ 17 ఎకరాలు, 6 ఎకరాలు బఫర్‌జోన్ కలిపి మొత్తం 23 ఎకరాల చెరువు అది. దానికింద 150 ఎకరాల ఆయకట్టు ఉన్నది’ అని హరీశ్ తెలిపారు. ల్యాండ్ సీలింగ్ యాక్టు ప్రకారం ఆ భూముల అమ్మకాలు, కొనుగోలు నిషేధమని, దీంతో ఆ కంపెనీలు లచ్చమ్మకుంట చెరువుకు ఉండే ఫీడర్ కెనాళ్లను మూసివేశాయని చెప్పా రు. ఆ చెరువులోకి నీళ్లు పోకుండా చేశాయని, ఈ నిమిషానికి కూడా ఆ చెరువులో నీళ్లు ఉన్నాయని వివరించారు. ‘వర్షపు నీరంతా అందులోకే వెళ్తున్నది. చెరువులను కాపాడుతామన్న హైడ్రా రంగనాథ్ ఎందుకో కండ్లు మూసుకున్నడు? నేను అడుగుతున్నా.. రేపు వెళ్తావా? నేను పోవాల్నా? నువ్ పోకపోతే నేను పోతా, మా పార్టీని, ఎమ్మెల్యేలను తీసుకొని పోతా.. ఆ రేకులు తీసేయ్.. గోడలు పగులగొట్టు, ఫీడర్ చానళ్లను బాగు చెయ్. పేదల తెరువుకు వెంటనే పోతవు.. వీళ్ల జోలికి ఎందు కు పోతలేవు మిస్టర్ రంగనాథ్?’ అని నిలదీశారు. ‘లచ్చమ్మకుంట నిండితే ఆ వరద నీరు నాన్చెరువుకు, మర్రివారి కుంట, అక్కడి నుం చి రెడ్డికుంట, సున్నం చెరువు నాళా, ఇంజావూరు మాసం చెరువు వరకూ పోవాలె.
ఇప్పుడు మొత్తం బంద్ పెట్టారు. లచ్చమ్మకుంటకు నీళ్లు రానిస్తలేరు.. అక్కడి నుంచి మిగతా చెరువులకూ నీళ్లు పోనిస్తలేరు. ఆ భూమిలో లింగమయ్య గుట్ట, గుగ్గిళ్ల గుట్ట, కుమ్మరోని బోడుగుట్ట వంటి చిన్న చిన్న గుట్టలు 80-100 ఎకరాల్లో ఉన్నయ్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. గుట్టలన్నీ మాయమైనయ్. రాళ్లు, మట్టి అమ్ముకొని కోటు సంపాదించిండ్రు’ అని హరీశ్ మండిపడ్డారు. వాటన్నీంటిలో 12 ఎకరాలున్న ఒక్క లింగమయ్య గుట్ట ఒక్కటే మిగిలిందని, దానిపై శివలింగం ఉన్నది కాబట్టే బతికిపోయిందని చెప్పారు. శివుడే ఆ గుట్టను కా పాడుకున్నాడని, లేకుంటే దాన్నీ మింగేవారని దుయ్యబట్టారు. ‘ఇంత జరుగుతుంటే మైనిం గ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది? హైడ్రా ఏం చేస్తున్నది? ఆర్డీవో ఏం చేస్తున్నడు? కలెక్టర్ ఏం చేస్తున్నడు? హైదరాబాద్ నడిబొడ్డున 80 ఎకరాల గుట్టలు మాయమవుతుంటే నీ ప్రభు త్వం నిద్రపోతున్నదా రేవంత్‌రెడ్డీ?’ అంటూ తూర్పారబట్టారు. ‘మా మీద విచారణకు సీబీసీఐడీలు, సిట్లు, సీబీఐని వేస్తవ్ కానీ.. వీటి మీద ఎందుకు వెయ్యవు? నీకు ఎంత వాటా ఉన్నది? వాటా లేకుంటే ఎందుకు అడ్డుకుంటలేవు? గుట్టలు, చెరువులు మాయమైనా అడ్డుకోవు.. గూండాలు వచ్చి గోడలు పెట్టి ఫెన్సింగ్ వేస్తే అడ్డుకోవు.. నువ్ ఉన్నది ఎందుకు?’ అని నిలదీశారు. ఆఖరుకు గొర్రెలు, మేకలు, పశువులు, మనుషులను కూడా ఆ దారిన పోనిస్తలేరని వాపోయారు.
భూమికి సంబంధించి పిటిషన్ సుప్రీంకోర్టులో జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ప్రసన్న బీవరాలె న్యాయమూర్తుల దగ్గర పెండింగ్‌లో ఉన్నదని, ఎల్లుండి విచారణకు వస్తున్నదని, దానిపై ప్రభుత్వం గట్టిగా కొట్లాడాలని హరీశ్ డిమాండ్ చేశారు. ఆర్డీవో దగ్గర, హైకోర్టులో గెలిచామని, ఇక కోర్టులో ప్రభుత్వం గట్టిగా కొట్లాడుతదా? లేదా అనేది చూడాలని చెప్పారు. సుప్రీంకోర్టు స్టే లేదు కాబట్టి.. హైకోర్టు తీర్పు, ఆర్టీవో నిర్ణయమే ఫైనలని, అలాంటప్పుడు ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదనేది సమస్యగా మారిందని వివరించారు. ‘భూకబ్జాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడితే మంత్రయినా, తమ్ముడైనా ఎవ్వర్నీ వదిలిపెట్టనని రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుడు కాదు. నీ మాటలు నిజమైతే, నీకు నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే, నువ్వు రక్షకుడివైతే, మాటమీద ఉండేవాడివైతే తక్షణమే హైడ్రాను పంపించి ఆభూమి చుట్టూ ఉన్న ఫెన్సింగ్, కంపౌండ్వాల్ను కూలగొట్టు. ఆ భూములను స్వాధీనం చేసుకోని వెంటనే ప్రభుత్వ భూమిగా ప్రకటించు. ఆ భూముల చుట్టూ ఉన్న గూండాలను అరెస్ట్ చేయించి, క్రిమినల్ కేసులు పెట్టు. నీ నిజాయితీ రుజువు చేసుకో’ అని సవాల్ విసిరారు. ‘ఆనాడు చంద్రబాబు పోరాడారు. రాజశేఖర్‌రెడ్డి ఈ భూమిని ప్రభుత్వ భూమిగా ప్రకటించారు. కేసీఆర్ కాపాడారు. నువ్వు కాపాడుతవా? వాటిని భక్షిస్తవా? ఆ భూములను పేదలు, ప్రభుత్వానికి దక్కేలా చూస్తావా? లేక గద్దలకు ఇస్తవా తేల్చుకో?’ అని సవాల్ విసిరారు.
‘కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వారం రోజులకే అంటే 13.12.2023న అక్కడ భూమి కబ్జా చేసిండ్రు. ఆ బోర్డులపై ‘దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు కోహినూర్ గ్రూప్’ అని రాసుకున్నరు. ఇక మరోబోర్డు 31.3.2026న పెట్టిం డ్రు. అందులో ‘దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు ఎంఈఐఎల్ అండ్ శిల్పా ఇన్ఫ్రా’ అని రాసుకున్నరు. ఇందులో శిల్పా ఇన్ఫ్రా ఎవరిది? రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కొడుకు డైరెక్టర్‌గా ఉన్న కంపెనీ అది’ అని హరీశ్ వివరించారు. అదే టైమ్‌లో తాము మార్చి 28న అసెంబ్లీలో మైనింగ్ స్కామ్ బయటికి తీసిన వెంటనే 2.4.2026న ఇక్కడ బోర్డు మలిపేశారని చెప్పారు. రెండు రోజుల్లో దానిపై తెల్లటి పెయింట్ కొట్టినట్టు తెలిపారు. 4.4.2026న శిల్పా ఇన్ఫ్రా, ఎంఈఐఎల్ పోయి జాయింట్ డెవలప్మెంట్ కోహినూర్ గ్రూప్ ఇంప్లెక్స్ ఇన్ఫ్రా అనే పేరుతో కొత్త గ్రూపు వచ్చిందని వివరించారు. ‘ఇలా బోర్డు లు ఎందుకు మారుతున్నయ్? అసెంబ్లీలో ప్రస్తావించిన మైనింగ్ స్కామ్‌కు ముందు మా ఆర్ఎస్ ప్రవీణ్, శ్రవణ్ వెళితే అక్కడ తెల్లారేసరికి పెయింట్ పడింది. ఇక్కడ కూడా ఇష్యూ అవుతుండటంతో వెంటనే పెయింటింగ్‌లు వేసిండ్రు. మళ్లీ బోర్డులు మారినయ్. ఈ చిత్ర విచిత్రాల వెనుక ఎవరున్నరో అర్థమవుత లేదా?’ అని నిలదీశారు. ‘ఇక కంపెనీస్ యాక్ట్ వెబ్సైట్లో సెర్చ్ చేస్తే ఇది శిల్పా ఇన్ఫ్రా లిమిటెడ్‌గా తేలింది.
అందులో డైరెక్టర్లు ఎవరున్నారనే అంశాన్ని పరిశీలిస్తే సింగిరెడ్డి రమాదేవి, సింగిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మూడో డైరెక్టర్‌గా శిల్పా రాఘవా వెంచర్స్ పేరు ఉన్నది. శిల్పా రాఘవా ఎల్ఎల్పీ ఎవరిదని పరిశీలించి, అందులో ఎవరెవరు డైరెక్టర్లు ఉన్నారో వెతికితే పొంగులేటి హర్షారెడ్డి, పొంగులేటి లోహిత్‌రెడ్డి, పొంగులేటి స్వప్నిరెడ్డి డైరెక్టర్లు ఉన్నారు’ అని వివరించారు. వాటిని బట్టి ఆ భూముల వెనుక ఎవరున్నారో అర్థం కాలేదా? అని ప్రశ్నించా రు. ‘శిల్పా ఇన్ఫ్రా అంటే పొంగులేటి కుటుంబసభ్యులే నాదర్గుల్ భూముల వెనుక ఉన్నారనే అంశం బట్టబయలైంది’ అని తేల్చిచెప్పా రు. ‘ఇక సింగిరెడ్డి రమాదేవి, సింగిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్లు అటు శిల్పా ఇన్ఫ్రాలో, ఇటు శిల్పా రాఘవాలోనూ ఉన్నయ్. ఆ తర్వాత ఏక్యూ స్కేర్ రియల్టర్ ప్రైవేట్ లిమిటెడ్ కం పెనీ నాదర్గుల్లోని 373 ఎకరాల భూమికి కాంపౌండ్ వాల్ పెట్టుకునేందుకు బడంగ్పేట్ మున్సిపల్ కమిషన్‌కు దరఖాస్తు పెట్టుకున్నది.
అసలు ఈ ఏక్యూ స్కేర్ కంపెనీ ఎవరిది? డైరెక్టర్లు ఎవరు? అనే అంశాన్ని పరిశీలించినం. కోహినూర్ కన్స్ట్రక్షన్స్, న్యూ హైద్రాబాద్ రియల్టర్ డెవలపర్స్, మూడో పేరు క్రిస్టల్ మ్యాన్సెన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నది. ఈ క్రిస్టల్ మ్యాన్సెన్స్ ఇండియా కంపెనీ ఎవరిది? ఇందులో డైరెక్టర్లు ఎవరో వెలికితీసినం. డైరెక్టర్‌గా పొంగులేటి హర్షారెడ్డి ఉన్నట్టు బయటపడింది. అంటే కాంపౌండ్ వాల్ కోసం దరఖా స్తు పెట్టిన కంపెనీతోనూ పొంగులేటి కుటుంబానికి సంబంధం బట్టబయలైంది’ అని వెల్లడించారు. ఇలా భూములను రక్షించాల్సిన వారే భూ బకాసురులయ్యారని నిప్పులు చెరిగారు. ఇలాంటి పరిస్థితుల్లో, ఈ ప్రభుత్వంలో ఇక పేదవాడికి రక్షణ ఎలా? ఎక్కడ దొరుకుతుం ది? అని నిలదీశారు. అందుకే పోలీసులు వాళ్ల ను బెదిరిస్తున్నారని, ఆర్డీవో వద్దకు వెళ్తే స్పంద న లేదని, కలెక్టర్ వద్దకు పోయినా స్పందిస్తలేరని, హైడ్రా కూడా కండ్లు మూసుకున్నదని, ప్రభుత్వ పెద్దలే గద్దలైనప్పు డు వారంతా ఎలా స్పందిస్తారని, పేదలకు ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. ‘భూములకు కస్టోడియన్‌గా, ల్యాండ్ రెవెన్యూ ట్రిబ్యునల్ చైర్మన్‌గా ఉన్న ఆర్డీవో ఎందుకు మౌనంగా ఉంటున్నరు? రెవెన్యూ మంత్రి కుటుంబ సభ్యులే దీని వెనుక ఉంటే ఆర్డీవో ఏం చేస్తరు?’ అని వాపోయారు.
నాదర్గుల్ భూముల్లో లింగమయ్య గుట్ట, గుగ్గిళ్ల గుట్ట, కుమ్మరోని బోడుగుట్ట వంటి చిన్నచిన్న గుట్టలు 80-100 ఎకరాల్లో ఉన్నయ్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గుట్టలన్నీ మాయమైనయ్. వాటిని ఖతంచేసి పడేసిండ్రు. రాళ్లు, మట్టి అమ్ముకొని కోట్లు సంపాదించుకున్నరు. వాటన్నింటిలో 12 ఎకరాలున్న ఒక్క లింగమయ్య గుట్ట ఒక్కటే మిగిలింది. దానిపై శివలింగం ఉన్నది కాబట్టే బతికిపోయింది. శివుడే ఆ గుట్టను కాపాడుకున్నడు. లేకుంటే దాన్ని కూడా మింగేటోళ్లు.
-హరీశ్‌రావు
మేము స్కామ్‌లు బయటకు తీయడం.. మంత్రి రంగులు మార్చడం పరిపాటిగా మారింది. కొత్వాల్‌గూడ మైనింగ్ స్కామ్ గురించి మార్చి 28న అసెంబ్లీలో మేం బయటపెట్టినం. దానికి ముందు మా ఆర్ఎస్ ప్రవీణ్, శ్రవణ్ అక్కడికి వెళ్లే సరికి క్రషర్ వద్ద ఉన్న కంటెయినర్‌పై తెల్లటి పెయింట్ కొట్టిండ్రు. 2026, ఏప్రిల్ 2న అక్కడ బోర్డు మలిపేసిండ్రు. 2026, ఏప్రిల్ 4న శిల్పా ఇన్ఫ్రా, ఎంఈఐఎల్ పోయి జాయింట్ డెవలప్మెంట్ కోహినూర్ గ్రూప్ ఇంప్లెక్స్ ఇన్ఫ్రా అనే పేరుతో నాదర్గుల్లో కొత్త గ్రూపు వచ్చిందని బట్టపెట్టినం. ఆ బోర్డులను కూడా మార్చిండ్రు. ఇలా బోర్డులు ఎందుకు మారుతున్నయ్? ఇష్యు కావడం వల్లే వెంటనే పెయింటింగ్‌లు వేసి బోర్డులు మార్చిండ్రు. ఈ చిత్ర విచిత్రాల వెనుక ఎవరున్నరో మనకు అర్థమవుత లేదా?
– హరీశ్‌రావు
నాదర్గుల్ భూముల ఆక్రమణకు మొదట కోహినూర్, తర్వాత శిల్పా ఇన్ఫ్రా కంపెనీ వచ్చి చేరింది. శిల్పాలో మూడు కంపెనీలుంటే అందులో ఒకటి పొంగులేటి హర్షది! తర్వాత దాని స్థానంలో ఇన్ఫ్లెక్స్ వచ్చింది. అందులోని భాగస్వాముల్లో ఒకరు పొంగులేటి హర్ష. అంటే దొంగ కంపెనీలు, మారు పేర్లతో ఆ భూమిని కబ్జా చేసింది వాళ్లే!
-హరీశ్‌రావు
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ గ్రామంలో పాత సర్వే నంబర్ 613/ కొత్త సర్వే నంబర్ 119 కింద ఉన్న స్థలం భూభారతి వెబ్సైట్లో చూసినా అది ప్రభుత్వ భూమి, ప్రొహిబిటెడ్ ల్యాండ్‌గానే చూపిస్తున్నది. ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ సెక్షన్ 17 కింద సీలింగ్ డిక్లరేషన్ ఇవ్వకుండా, ట్రిబ్యునల్ ఆర్డర్ లేకుండా భూములు అమ్మితే అవి చిత్తుకాగితాలతో సమానమని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ 2023, సెప్టెంబర్ 2న మూడు కంపెనీలు సుప్రీంకోర్టుకు వెళ్తే దానిపై సుప్రీంకోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదు. అంటే హైకోర్టు జడ్జిమెంట్ ‘స్టాండ్స్ గుడ్’ అని భావించాలి. కోర్టు తీర్పులు, చట్టాలున్నా కస్టోడియన్‌గా ఉండి భూములను కాపాడాల్సిన కందుకూరు ఆర్డీవో కండ్లు మూసుకున్నరు.
-హరీశ్‌రావు
నాదర్గుల్లో లచ్చమ్మకుంట చెరువు ఉన్నది. 17 ఎకరాలు ఎఫ్టీఎల్, 6 ఎకరాలు బఫర్‌జోన్! 23 ఎకరాల చెరువు కింద 150 ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఫీడర్ కెనాళ్లను ఆ కంపెనీలు మూసేసినయ్. చెరువులోకి నీళ్లు పోకుండా చేసినయ్. చెరువులు కాపాడుతామన్న హైడ్రాకు ఇవి కనబడ్తలేవా? నేను అడుగుతున్న. రంగనాథ్.. ఆ రేకులు తీసెయ్.. గోడలు పగులగొట్టు.. ఫీడర్ చానళ్లను బాగు చెయ్. నువ్వు పోతవా? మా పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని నేనే పోవాల్నా?
-హరీశ్‌రావు
మేం 37 ఏండ్లుగా నాదర్గుల్ భూములు సాగుచేస్తున్నం. ఎవరో ఒకాయనొచ్చి మా భూములు గుంజుకుంటున్నడు. ‘ఐదు, పది లక్షలు ఇస్తం! వెళ్లిపోండి’ అని బెదిరిస్తున్నడు. ఒప్పుకోకుంటే గేటు పెట్టి పొలాలకు మమ్మల్ని పోనిస్తలేడు. ఇదేందని అడిగితే బౌన్సర్లతోని నా భర్త మీద దాడి చేయించిండు. 50 వేలు పెట్టి వేసుకున్న కంచెను రాత్రికిరాత్రే తీసేసిండ్రు. ఎవరు తీయుమన్నరని అడిగితే.. తిరుపతి, సుధాకర్ అని పేర్లు చెప్తున్నరు. పొలం దగ్గరికి మమ్మల్ని పోనిస్తలేరు. మాకు భూమే బతుకుదెరువు. ఐదు, పది లక్షలిస్తే ఎట్ల బతుకుతం?
-కర్రె కౌసల్య, భూ బాధితురాలు
మా అత్తామామలు 70 ఏండ్లుగా భూములు సాగుచేస్తున్నరు. మా భూమిలో వాళ్లెవరో వచ్చి రేకులు పాతి కబ్జాచే యాలని చూస్తున్నరు. అందుకే ఫొటోలు తీసుకున్నం. మొన్న భూమిని సాఫ్ చేసుకుందామని లోపలికి పోయిన నా భర్తను బౌన్సర్లతో అడ్డుకున్నరు. నన్ను కూడా అడ్డుకున్నరు. గట్టిగ అడిగితే నా భర్త మీద కేసు పెట్టిండ్రు. మేం భయంభయంగ బతుకుతున్నం. ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకుంటలేరు.
– గురాల మమత, భూ బాధితురాలు

నాదర్గుల్ భూముల్లో ‘కోహినూర్ గ్రూప్’ పేరిట వెలిసిన బోర్డు
ఆ గ్రూప్ సోదర సంస్థలుగా రాఘవ కన్స్ట్రక్షన్స్, ఏక్యూ స్కేర్, క్రిస్టల్ ఉన్నాయి. రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి కుటుంబానిది.

ఎంఈఐఎల్- శిల్పా ఇన్ఫ్రా పేరిట వెలిసిన బోర్డు
శిల్పా ఇన్ఫ్రాలో డైరెక్టర్లు సింగిరెడ్డి రమాదేవి, సింగిరెడ్డి చంద్రమోహ న్‌రెడ్డి, శిల్పా రాఘవ వెంచర్స్. శిల్పారాఘవలో డైరెక్టర్లుగా ఉన్న పొంగులేటి హర్షారెడ్డి, లోహిత్‌రెడ్డి, పొంగులేటి స్వప్నిరెడ్డి

తర్వాత తెరమీదికి వచ్చి, ఉమ్మడిగా బోర్డును పాతింది
కోహినూర్ గ్రూప్, ఇంప్లెక్స్ ఇన్ఫ్రా!కోహినూర్‌లో పొంగులేటి కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ భాగస్వామి కాగా, ఇంప్లెక్స్ ఇన్ఫ్రా ఎవరిదనే వివరాలు తెలియాల్సి ఉన్నది.
కంపౌండ్‌వాల్ నిర్మాణానికి అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నది ఏక్యూ స్కేర్ రియల్టర్ ప్రైవేట్ లిమిటెడ్
ఏక్యూ స్కేర్‌లో భాగస్వాములుగా కోహినూర్ కన్స్ట్రక్షన్స్, న్యూ హైదరాబాద్ రియల్టర్ డెవలపర్స్, క్రిస్టల్ మ్యాన్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి. క్రిస్టల్ మ్యాన్షన్స్లో డైరెక్టర్‌గా మళ్లీ పొంగులేటి హర్షారెడ్డి పేరు