యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సోమవారం హరిహరులకు ప్రత్యేక పూజలు కొనసాగాయి. వైష్ణవాగమశాస్త్రరీతిలో యాదాద్రీశుడికి, శైవాగమశాస్త్రరీతిలో కొండపై వేంచేసి ఉన్న పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరుడి కి అర్చకులు పూజలు నిర్వహించారు. శివుడికి రుద్రాభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు. ప్రభాతవేళలో మొదటగా గంటన్నర పాటు శివుడిని కొలుస్తూ రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. పంచామృ తాలతో అభిషేకించారు. శివుడిని విభూతితో అలంకరించారు.
ఆలయంలోని సుబ్రహ్మణ్యస్వామి, మహాగణపతి, ఆంజనేయస్వామి, నాగదేవత విగ్రహాలను అభిషేకించి అర్చన చేశారు. నిత్య పూజలు ఉదయం నాలుగు గంటల నుంచి ప్రారంభమయ్యాయి. బాలాలయంలో కవచమూర్తులను అభిషేకించి అర్చించిన అర్చక బృందం బాలాలయంలో సుదర్శన నారసింహహోమాన్ని జరిపారు. అనంతరం స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామి వారి నిత్య కైంకర్యాలలో పాల్గొని మొక్కులు చెల్లిం చుకున్నారు. శ్రావణమాసం సందర్భంగా సత్యనారాయణస్వామి వ్రతాల్లోనూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సామూహిక వ్రతమాచరించి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.