ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు అరవై ఏండ్లపాటు తెలంగాణ మత్స్యరంగం పూర్తిగా నిర్లక్ష్యానికి, అణచివేతకు, విస్మరణకు గురైంది. ప్రత్యేక రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో దాదాపు పదేండ్లలో గుణాత్మక అభివృద్ధి నమూనాగా రూపొందింది. ఇప్పుడు ఆ నమూనాలను సమూలంగా ధ్వంసం చేసేందుకు కాంగ్రెస్ పాలకులు పూనుకున్నట్టు కనిపిస్తున్నది. ఇందుకు పలు నిదర్శనాలు ఉన్నాయి. రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమం, స్వావలంబన కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన చేపపిల్లల ఉచిత పంపిణీ పథకాన్ని నీరుగార్చడం, మత్స్యసహకార సంఘాలను నిర్వీర్యం చేయడం, మత్స్యకారుల ఉపాధి కల్పనలో జీవనాడిగా నిలిచిన నీటివనరులను విధ్వంసం చేయడం లాంటి మూడు పద్ధతులను ఈ ప్రభుత్వం అమలు పరుస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. రాష్ట్రప్రభుత్వమే సహకార వ్యవస్థను అడ్డుపెట్టుకుని, మత్స్యశాఖను వాడుకుంటూ ముప్పేట దాడికి పాల్పడుతున్నది. ఫలితంగా రాష్ట్రంలోని 50 లక్షలకుపైగా మత్స్యకారులు విలవిల్లాడుతున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే వినూత్నమైన పద్ధతిలో మత్స్యకారులకు చేపపిల్లల ఉచిత పంపిణీ పథకాన్ని అమలు చేసింది. 2016లో ప్రారంభించిన ఈ పథకంతో ఎనిమిది పర్యాయాలు లబ్ధి చేకూర్చింది. ఇందుకు రూ.560 కోట్లు ఖర్చుచేసింది. మత్స్య సహకార సంఘాల బలోపేతం కోసం జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ద్వారా సుమారు రూ.1000 కోట్ల భారీ రుణసదుపాయంతో సమీకృత మత్స్య అభివృద్ధి పథకాన్ని అమలు పరిచింది. ఈ రెండు కార్యక్రమాల ఫలితంగా మత్స్యకారుల జీవితాల్లో నూతనోత్సాహం కనిపించింది. మత్స్యసహకార సంఘాల్లో సభ్యత్వానికి ఆసక్తి, పోటీ పెరిగాయి. సంఘాల్లో సభ్యులుగా చేరడాన్ని గుర్తింపు, గౌరవంగా భావించే పరిస్థితులు నెలకొన్నాయి. సమగ్ర విధానాలతో చేపల ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదల నమోదయ్యింది.
మత్స్యకారుల తలసరి ఆదాయం పెరిగింది. తెలంగాణలో నీలివిప్లవం కనిపించింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేండ్లుగా మత్స్యరంగంలో, మత్స్యకారుల జీవన స్థితిగతుల్లో తిరోగమన పరిస్థితులు ఎదురవుతున్నాయి. నీలి విప్లవం నీరుగారిపోతున్నది. చేపపిల్లల పంపిణీ పథకం అమల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. రెండేండ్లలో పథకం కనీసం 50 శాతం కూడా అమలు జరగలేదు. చేపపిల్లలు సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలోనూ ప్రభుత్వం మొండివైఖరిని అవలంబిస్తున్నది. కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించగా, బిల్లుల చెల్లింపు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ ప్రభుత్వం కాంట్రాక్టర్లను సతాయిస్తూనే ఉన్నది. బిల్లులను పూర్తిగా చెల్లించలేదు. ఈ తాత్సారంపై కూడా కాంట్రాక్టర్లు మరోసారి హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. బిల్లుల చెల్లింపు వ్యవహారాలు కోర్టుధిక్కరణ కేసులను నమోదుచేసే స్థాయికి వెళ్లాయి. అయినా ఈ ప్రభుత్వంలో, మత్స్యశాఖలో చలనం లేదు.
కొత్తగా మత్స్యశాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టిన వాకిటి శ్రీహరి మాట్లాడుతూ తమ ప్రభుత్వం చేపపిల్లల పంపిణీ పథకాన్ని పకడ్బందీగా, పారదర్శకంగా అమలు చేస్తున్నదని, రూ.122 కోట్లు కేటాయించినట్టు గొప్పలు చెప్పారు. కానీ మంత్రి ప్రకటించిన లెక్కల్లో సగం కూడా వాస్తవంలో పంపిణీ జరగకపోవడం, నిధులు ఖర్చు పెట్టకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి, మత్స్యశాఖమంత్రి పనితీరుకు అద్దం పడుతున్నది. ఇక ప్రత్యేక పథకం అమలు పరచాలనే ఆలోచన, ప్రయత్నం ప్రభుత్వం వద్ద లేవు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఫిషరీస్ కార్పొరేషన్ అంశం ఉద్దేశపూర్వకంగానే అటకెక్కించారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరి మత్స్యశాఖమంత్రిగా ఉన్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం కనిపించడంలేదు.
మొత్తంగా గడిచిన రెండేండ్ల కాంగ్రెస్ పాలనాకాలంలో మత్స్యకారుల్లో తీవ్రమైన నిరాశ, నిస్పృహ నెలకొన్నాయి. కానీ మత్స్యశాఖ అధికారులు మాత్రం తెలంగాణలో చేపల ఉత్పత్తి ఏటా పెరుగుతున్నదని, చేపల ఆహార వినియోగంలో గణనీయమైన అభివృద్ధి జరుగుతున్నదని, రాష్ట్రంలోని ప్రజలకు చేపలు విస్తారంగా అందుబాటులో ఉంటున్నాయని ‘స్టీరియోఫోనిక్’ నివేదికలు తయారుచేసి, స్వీయ
కితాబులు ఇచ్చుకుంటున్నారు.
సహకార వ్యవస్థకు సంబంధించిన స్ఫూర్తిని సమూలంగా సంహరించడమే తెలంగాణలో నేటి పాలకులు తమ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న మత్స్య సహకార సంఘాల ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పేద మత్స్యకారుల సాధికారత కోసం ఏర్పడిన ఈ వ్యవస్థను ప్రస్తుత ప్రభుత్వం తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నది. ముఖ్యంగా తెలంగాణ సహకార సంఘాల చట్టం- 1964లోని సెక్షన్ 32 (7)(ఏ) (1)ను అడ్డం పెట్టుకొని, ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికలను అడ్డుకుంటూ, పాలకపెద్దలు తన సొంత పార్టీ క్యాడర్‌ను పర్సన్ ఇన్‌చార్జ్‌ల రూపంలో సంఘాలపై రుద్దుతున్నది. సాధారణంగా ఏదైనా సహకార సంఘం పదవీ కాలం ముగిసినప్పుడు, అనివార్య కారణాల వల్ల ఎన్నికలు జరగకపోతే, తాత్కాలికంగా ఆ సంఘం కార్యకలాపాలను పర్యవేక్షించడానికి అధికారులను లేదా ఒక కమిటీని నియమించేందుకు ఈ సెక్షన్ అవకాశం కల్పిస్తుంది. అయితే, ఇది కేవలం తాత్కాలిక ఏర్పాటు మాత్రమే.
వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించి, బా ధ్యతలను ఎన్నికైన ప్రతినిధులకు అప్పగించడమే ఈ సెక్షన్ అసలు ఉద్దేశం. కానీ, నేడు తెలంగాణలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉన్నది. నిరుడు సెప్టెంబర్ 3న విడుదల చేసిన జీవో ఆర్టీ నంబర్ 60 ద్వారా ప్రభుత్వం జిల్లా మత్స్య సహకార సంఘాల్లో అప్పటికే ఉన్న చీఫ్ ప్రమోటర్లు, కమిటీలను తొలగించి, తమకు అనుకూలమైన వారిని నామినేట్ చేసే ప్రక్రియకు తెరలేపింది. ఇది ముమ్మాటికీ చట్టాన్ని దుర్వినియోగం చేయడమే.
ప్రభుత్వ తీరుపై మత్స్యసహకారసంఘాల సీనియర్ నాయకుడు బుస్సా మల్లేశం నాయకత్వంలో పలువురు మత్స్యకారులు హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారుల పక్షాన గత రెండు దశాబ్దాలుగా నిరంతరంగా న్యాయపోరాటం చేస్తున్న సీనియర్ అడ్వకేట్ డీఎల్ పాండు ముదిరాజ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ నంబర్ 16103/2025 కేసును విచారించిన హైకోర్టు ప్రభుత్వ చర్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
ఎన్నికలు నిర్వహించకుండా, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం పాత కమిటీలను తొలగించి కొత్తవారిని నియమించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టంచేసింది. హైకోర్టు ఆదేశించినా ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తున్నందుకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మత్స్యశాఖ కార్యదర్శిపై ‘కోర్టు ధిక్కరణ’కేసులు కూడా నమోదయ్యాయి. 21 జిల్లాల్లో ఓటర్ల జాబితాను ఖరారు చేయకుండా, కుంటిసాకులు చెప్తూ ప్రభుత్వం కోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తున్నదని విచారణలో తేలింది.
రాష్ట్రస్థాయిలో మత్స్యకారుల కోసం ఉన్న అత్యున్నత సంస్థ ‘తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య’ (TSFCOF) పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. జిల్లా సంఘాల నుంచి ఎన్నికైన ప్రతినిధులు ఈ సమాఖ్య చైర్మన్‌ను ఎన్నుకోవాల్సి ఉండగా, ప్రభుత్వం నేరుగా తమ పార్టీ నేతలను ఆ పదవిలో నామినేట్ చేస్తున్నది. ఈ సమాఖ్య పదవీకాలం మూడు నెలల్లో ముగియనున్నది. ఈ లోగా జిల్లాల్లో తమకు అ నుకూలమైన పర్సన్ ఇన్చార్జీలను నియమించుకుంటే, రాష్ట్రస్థాయిలోనూ తమకే అధికారం దక్కుతుందనేది పాలకపక్షం ఎత్తుగడ. రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మత్స్యకారుల ఓటు బ్యాం కును ఆకర్షించేందుకు ఈ ఎత్తుగడలు వేస్తున్నట్లు స్పష్టమవుతున్నది. సహకార సంఘాల్లో తమ మనుషులు ఉంటే ఓటర్లను ప్రభావితం చేయవచ్చని కాంగ్రెస్ నేతల కుట్ర.
రాజకీయ క్రీడలో పేద మత్స్యకారులు బలిపశువులు అవుతున్నారు. ఎన్నికైన ప్రతినిధులు లేకపోవడంతో సంఘాల ద్వారా అందాల్సిన రాయితీలు, పథకాలు సక్రమంగా అందడం లేదు. ప్రభుత్వం నియమించిన పర్సన్ ఇన్‌చార్జీలకు క్షేత్రస్థాయి సమస్యలపై అవగాహన లేకపోవడంతో మత్స్యరంగం కుదేలవుతున్నది. సహకార రంగం అంటేనే అందరి కోసం అందరూ అనే స్ఫూర్తితో సాగాలి. కానీ నేడు తెలంగాణలో పార్టీ కోసం సంఘం అనే రీతిలో పాలన సాగుతున్నది. ఇప్పటికైనా హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం గౌరవించి, సెక్షన్ 32 ముసుగులో చేస్తున్న రాజకీయ నామినేషన్లను పక్కనపెట్టి, తక్షణమే పారదర్శకమైన ఎన్నికలు నిర్వహించాలి. లేనిపక్షంలో, సహకార రంగం ఉనికి కోల్పోయి ప్రభుత్వశాఖగా మారిపోయే ప్రమాదం ఉన్నది.
– (వ్యాసకర్త: తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు)
పిట్టల రవీందర్