హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచీ కాంగ్రెస్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన కమ్యూనిస్టులు క్రమంగా దూరం జరుగుతున్నారు. కమ్యూనిస్టులు తమతో కలిసే ఉన్నారని అధికార పార్టీ నేతలు బహిరంగ సమావేశాల్లో చెప్తున్నా.. క్షేత్రస్థాయిలో పలుచోట్ల విభేదించినట్టు స్పష్టమవుతున్నది. పురపాలక ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు ఇప్పుడు తలోదారి వెతుక్కున్నాయి. ప్రధానంగా కమ్యూనిస్టుల ప్రభావం ఉన్న సింగరేణి కోల్‌బెల్ట్ ఏరియాలో, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులకు మధ్య బెడిసికొట్టినట్టు స్పష్టమవుతున్నది. సింగరేణి ఐదు మున్సిపాలిటీలు, మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో విస్తరించి ఉన్నది. మేజర్ కోల్‌బెల్ట్ ప్రాంతంలో కమ్యూనిస్టులు కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకొని ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా బీఆర్ఎస్తో జతకట్టడం లేదా ఒంటరిగా పోటీచేస్తున్నాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యేగా ఉన్న కొత్తగూడెం కార్పొరేషన్లో కూడా కాంగ్రెస్, సీపీఐ వేర్వేరుగా పోటీకి దిగాయి. ఇక్కడ సీపీఐ, టీడీపీ పొత్తు పెట్టుకోవడం గమనార్హం. టీడీపీ ఎవరికీ బీ-ఫామ్ ఇవ్వకపోయినా, టీడీపీ సూచించిన అభ్యర్థులకు సీపీఐ పార్టీ బీ-ఫామ్ ఇచ్చి పోటీలో నిలబెట్టినట్టు స్థానికంగా ప్రచారం జరుగుతున్నది.రెండేండ్ల కాంగ్రెస్ అసమర్థ పాలన, ప్రజావ్యతిరేక నిర్ణయాలపై అసంతృప్తి, సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీతో స్నేహం చేస్తున్నారన్న ప్రచారం నేపథ్యంలోనే లెఫ్ట్ పార్టీలు దూరం జరుగుతున్నాయని వాదన వినిపిస్తున్నది.
మంత్రుల పరిధిలోనే..
కమ్యూనిస్టుల ప్రభావం ఉన్న ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల తరహాలో తమతో కలిసి రావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతిపాదించినా కమ్యూనిస్టులు ఒప్పుకోలేదని తెలిసింది. స్థానిక ప్రజల మనోభావాలకు అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసినట్టు సమాచారం. తమ కార్యకర్తలు బీఆర్ఎస్తో కలిసి నిర్మాణాత్మక ఉద్యమాలు చేయటానికి ఇష్టపడుతున్నారని, కాబట్టి ఆ పార్టీతోనే కలిసి మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామని తేల్చిచెప్పినట్టు ప్రచారం జరుగుతున్నది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నియోజకవర్గ పరిధిలోని ఏదులాపురంలో, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గ కేంద్రం మధిర మున్సిపాలిటీలో కమ్యూనిస్టులు బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తున్నారు. ఇల్లందు, సత్తుపల్లి, కల్లూరు, వైరా మున్సిపాలిటీల్లోనూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు కమ్యూనిస్టు పార్టీ మద్దతు ఇస్తున్నట్టు సమాచారం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కూడా మెజారిటీ స్థానాల్లో బీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీ మధ్య పొత్తు కుదిరిందని తెలుస్తున్నది. భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరులో బీఆర్ఎస్తో సీపీఐ, సీపీఎం కలిసి పనిచేస్తున్నట్టు సమచారం. చౌటుప్పల్, మిర్యాలగూడ, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గం పరిధిలోని నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్తో సీపీఎం కలిసి పనిచేస్తున్నాయి. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పరిధిలోకి వచ్చే హుజూర్నగర్ మున్సిపాలిటీలోని 5వ వార్డులో సీపీఐ, సీపీఎం బీఆర్ఎస్తో కలిసి పోటీచేస్తున్నాయి. కోదాడ మున్సిపాలిటీలో సీపీఐ, టీడీపీ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. సూర్యాపేటలో మాత్రం ఎలాంటి పొత్తులు లేకుండా మూడు ప్రధాన పార్టీలు ఎవరికి వారు బరిలో ఉన్నారు.
కోల్‌బెల్ట్‌లోని మంచిర్యాల, రామగుండం, కొత్తగూడెం కార్పొరేషన్లతోపాటు బెల్లంపల్లి, క్యాతనపల్లి, భూపాలపల్లి, సత్తుపల్లి, ఇల్లందు మున్సిపాలిటీలు పూర్తిగా సింగరేణి కార్మికుల ఓట్లపైనే ఆధారపడి ఉన్నాయి. సింగరేణి ఉద్యోగులు తమ ఉద్యోగానికి రాజీనామా చేయకుండానే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే వెసులుబాటును ఎన్నికల సంఘం కల్పించడంతో కొన్ని చోట్ల కార్మికులే నేరుగా రంగంలోకి దిగారు. కోల్‌బెల్ట్‌లోని అత్యధిక ప్రాంతంలో కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకొని బీఆర్ఎస్తో జతకట్టడం లేదా ఒంటరిగా పోటీ చేస్తున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. మంచిర్యాల జిల్లాలో సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ బలంగా ఉన్న క్యాతనపల్లిలో బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించింది. వనపర్తి మున్సిపాలిటీలోని రెండు వార్డుల్లో బీఆర్ఎస్, సీపీఎం జట్టు కట్టినట్టు సమాచారం. ఉమ్మడి మెదక్ జిల్లాలోని చేర్యాల మున్సిపాలిటీలో సీపీఎం, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా కమ్యూనిస్టులు విభేదించినట్టు చర్చ జరుగుతున్నది.
రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల కమ్యూనిస్టులు సైతం అసంతృప్తితో ఉన్నారని చెప్తున్నారు. పాలనలో అసమర్థత కారణంగా ప్రజల్లో తీవ్ర వ్య తిరేకత పెరిగిందని, దీంతో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కమ్యూనిస్టులు కాంగ్రెస్‌కు దూరంకాక తప్పడం లేదని అంటున్నా రు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలని కార్యకర్తలు, క్షేత్రస్థాయి నేతలు డిమాండ్ చేయడంతో నాయకత్వం సైతం ఒప్పుకొన్నట్టు ప్రచారం జరుగుతున్న ది. దీనికితోడు కమ్యూనిస్టులు శత్రువుగా భావించే బీజేపీతో సీఎం రేవంత్‌రెడ్డి స్నేహం కూడా మరో ప్రధాన కారణమని చెప్పుకొంటున్నారు. ప్రధాని మోదీని పదేపదే పొగడ టం, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో విఫలం కావడం, రాష్ర్టానికి కేంద్రం నుంచి పెద్దగా సాయం అందకపోయినా స్పందించకపోవడం వంటి వాటిని వారు నిశితంగా గమనిస్తున్నట్టు తెలుస్తున్నది. బీఆర్ఎస్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకో, ఎన్నికలు వచ్చినప్పుడు తప్ప రాష్ట్రంలోని బీజేపీ నేతలపై సీఎం రేవంత్‌రెడ్డిగానీ, కాం గ్రెస్ నేతలుగానీ పెద్దగా విమర్శలు చేయకపోవడంపై కమ్యూనిస్టులు అసంతృప్తితో ఉన్న ట్టు సమాచారం. సీఎం రేవంత్ బీజేపీతో స్నే హం చేస్తున్నారన్న అనుమానాలు కాంగ్రెస్‌లోనే బలంగా ఉన్న నేపథ్యంలో క్రమంగా ఆ పార్టీకి దూరం కావడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.