KTR | హైదరాబాద్ : బోస్టన్లోని హార్వర్డ్ యూనివర్శిటీలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న జరగనున్న ఇండియా కాన్ఫరెన్స్ 21వ సదస్సులో ఫైర్‌చాట్‌లో మాట్లాడేందుకు రావాలని మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం పంపారు. ‘ఇండియా రైజింగ్-బిజినెస్, ఎకానమీ, కల్చర్’ అనే థీమ్‌పై ఈ సదస్సు జరగనున్నది. ‘తెలంగాణ సాధించిన అభివృద్ధిలో మీ ప్రభావవంతమైన నాయకత్వం, తెలంగాణను పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా నిలబెట్టడం మాకు గొప్ప ప్రేరణగా నిలస్తున్నది’ అని హార్వర్డ్ యూనివర్శిటీ తమ ఆహ్వానంలో పేర్కొంది.
హార్వర్డ్‌లోని ఇండియా కాన్ఫరెన్స్ అనేది అమెరికాలోని విద్యార్థులు నిర్వహించే అతిపెద్ద కార్యక్రమాల్లో ఒకటి. ఇందులో విద్యార్థులు, వ్యాపార ప్రముఖులు, విధాన నిపుణులు తదితర 1000మంది వరకూ ప్రవాస భారతీయులు పాల్గొంటారు. గతంలో అజీమ్ ప్రేమ్‌జీ, అమర్త్యసేన్, అనామికా ఖన్నాసహా పలువురు మంత్రులు, వ్యాపార ప్రముఖులు, విద్యావేత్తలు, సాంస్కృతిక దిగ్గజాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజాగా మంత్రి కేటీఆర్‌ను పాల్గొనాలకు ఆహ్వానం పంపారు.
హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి ఆహ్వానం అందడంపట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్రం అమలుచేస్తున్న ప్రగతిశీల విధానాలను చాటిచెప్పేందుకు, వివిధ రంగాల్లో రాష్ట్రం అందిస్తున్న అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఈ సదస్సు గొప్ప వేదిక కానున్నదని ఆయన పేర్కొన్నారు.