Congress Leader | మణికొండ, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): నగర శివారులోని హైదర్షాకోట్ గ్రామంలో ఓ కాంగ్రెస్ నేత వివాహితపై వేధింపులకు దిగుతున్నాడు. తన కామవాంఛ తీర్చాలని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఈ ఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసిం ది. నార్సింగి ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి కథ నం ప్రకారం.. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్షాకోట్లో నివాసం ఉంటున్న ఓ వివాహితను తన కోరిక తీర్చాలంటూ స్థానిక కాంగ్రెస్ నేత సుదర్శన్ అలియాస్ సిద్ధు కొంతకాలంగా వేధింపులకు పాల్పడుతున్నాడు. వివాహిత ఇంటి వైపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, ఆమె కదలికలను గమనిస్తున్నాడు. నిత్యం ఫోన్ చేసి, వేధింపులకు పాల్పడుతున్నాడు.
ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫోన్‌చేసి కామవాంఛ తీర్చకపోతే ప్రాణాలు తీస్తానంటూ బెదిరిస్తూ అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని బాధిత మహిళ శుక్రవారం నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. రెండు నెలలుగా తనకు ఫోన్ చేస్తూ తనతోబయటకు రావాలని, లేదంటే కుటుంబ సభ్యులను చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని పోలీసుల ముందు కన్నీరుమున్నీరయ్యింది. తాను అధికార పార్టీ నేతనని.. తన మాటే ఇక్కడ శాసనమని, ఈ ప్రాంతంలో తాను చెప్పిందే జరుగుతుంది తప్ప ఎవరూ తనను ఏమి చేయలేరంటూ బెదిరిస్తున్నాడని వాపోయింది. విషయం కుటుంబ సభ్యులకు చెప్తే కిరాయి హంతకులతో హత్య చేయిస్తానంటూ బెదిరించాడని వివరించింది. ఆ నాయకుడితో తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉన్నదని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి నిందితుడిని విచారిస్తున్నామని ఎస్సై చెప్పారు.