‘బలగం’ దర్శకుడు వేణు యెల్దండి తన ద్వితీయ ప్రయత్నంగా చేస్తున్న సినిమా ‘ఎల్లమ్మ’. దిల్రాజు నిర్మిస్తున్న ఈచిత్రం ద్వారా సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. మరి ‘ఎల్లమ్మ’లో కథానాయిక ఎవరు? ఈ ప్రశ్న గత కొంతకాలంగా ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తూనే ఉన్నది. ఈ క్రమంలో చాలామంది కథానాయికల పేర్లు కూడా వినిపించాయి. సాయిపల్లవి నుంచి మొదలై కీర్తిసురేశ్, రష్మిక మందన్నా, కృతి శెట్టి.. ఇలా చెప్పుకుంటూపోతే పెద్ద లిస్టే ఉన్నది. ఇప్పుడు తాజాగా ‘రొమాంచకం’ బ్యూటీ అనంతిక సనిల్కుమార్ పేరు వినిపిస్తున్నది. అయితే.. అందుతున్న సమాచారం ప్రకారం అనంతిక ఈ సినిమాకు కథానాయికగా దాదాపుగా ఖరారైనట్టు వినికిడి.
ఇటీవలే దేవిశ్రీప్రసాద్, అనంతికలపై మేకర్స్ ఓ ఫొటోషూట్ని కూడా నిర్వహించినట్టు తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సివుంది. ఇక ‘ఎల్లమ్మ’ కథ విషయానికొస్తే.. ఇది ఓ గ్రామదేవత నేపథ్యంలో సాగే కథ. రంగస్థల కళాకారుడైన ‘పర్షి’కి ఎల్లమ్మగా మారాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు ఈ ఎల్లమ్మ ఎవరు? ఎల్లమ్మతల్లికి పర్షి కుటుంబానికీ ఉన్న సంబంధం ఏంటి? అనే ఆసక్తికరమైన ప్రశ్నల నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ‘బలగం’ మాదిరిగానే తెలంగాణ నేపథ్య కథాంశంతో ఈ సినిమా సాగుతుంది.