హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 7నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించాలని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ నెల 6న ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో మధ్యాహ్నం లంచ్ తర్వాత 2 గంటలకు ప్రారంభమయ్యే సంయుక్త సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకావాలని పార్టీ అధినేత శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు.
శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ తరఫున లేవనెత్తాల్సిన అంశాలు, ప్రభుత్వ నిర్ణయాలపై స్పందన, ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించే విధానం తదితర అంశాలపై కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన నేపథ్యంలో జరుగుతున్న సమావేశాలను దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ శాసనసభా పక్షం సమన్వయంతో వ్యవహరించేలా కేసీఆర్ పలు కీలక ఆదేశాలు, సూచనలు చేయనున్నారు.