జవహర్నగర్, సెప్టెంబర్ 25: డంపింగ్ దుర్వాసనతో శ్వాసకోశ సమస్యతో అనారోగ్యానికి గురై మరణించిన బొల్లం కృష్ణ మృతి ముమ్మాటికీ రాంకీ యాజమాన్యం పరోక్షంగా చేసిన హత్యేనని ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. గాంధీ దవాఖానలో మృతి చెందిన కృష్ణ మరణాన్ని నిరసిస్తూ రాంకీ యాజమాన్యంపై హత్యానేరం కేసు నమోదు చేయాలని కోరుతూ నందమూరినగర్లో వైఎస్ఆర్ విగ్రహం ఎదుట శుక్రవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేశారు.
ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ అప్రజాస్వామికంగా లాభాపేక్షతో వ్యాపారాలు చేస్తూ ప్రజల జీవితాలను నాశనం చేస్తున్న రాంకీ యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేసి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అల్వాల్ సర్కిల్ ప్రాంతం చెత్తనే తీసుకుంటామని చెప్పిన రాంకీ… నేడు మహానగర చెత్తనంతా ఇక్కడికే తీసుకువస్తూ డంపింగ్ ప్రాంతమంతా విషవాయువులతో విజృంభిస్తుందన్నారు. 15ఏండ్లుగా శ్వాసకోశ, చర్మ, గర్భస్రావ వాధ్యులతో మధ్యంతరంగా ప్రాణాలొదిన వారికి రాంకీ యాజమాన్యమే బాధ్యత వహించాలని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో షేక్షావలీ, సుబ్రమణ్యం, శివబాబు, సాదానందం, వేణు, మల్లేశ్, సునీత, సావిత్రి, ప్రవీణ్, జావేద్, యాదగిరి, శారద తదితరులు పాల్గొన్నారు.