కుమ్రంభీం ఆసిఫాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మావోయిస్టుల ప్రభావం తగ్గడం తో గిరిజనులపై అటవీ అధికారుల వేధింపు లు ఎక్కువయ్యాయని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. బుధవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ కలెక్టరేట్లో మంత్రి సీతక్క ఆధ్వర్యంలో అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
బెజ్జూర్ మండలంలోని కొత్తగూడ, రెబ్బన, సిర్పూర్(టీ) మండలంలోని ఇట్యాల్పాడ్, కాగజ్‌నగర్ మండలంలోని అంకుశాపూర్, పెంచికల్పేట్ మండలంలోని కొండపల్లి తదితర గ్రామాల్లో గిరిజనులు సాగుచేసుకుంటున్న భూములను అటవీ అధికారులు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అంకుశాపూర్ పరిధిలో 2006లో దాదాపు 700 ఎకరాలకు అప్పటి ప్రభుత్వం అటవీ హక్కుల పత్రాలను ఇచ్చినప్పటికి అటవీ అధికారులు ఆ భూములను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఒకప్పుడు అడవుల్లో నక్సలైట్లు ఉండటంతో అడవిలోకి వచ్చేందుకు అటవీ అధికారులు భయపడేవారని గుర్తుచేశారు. ఇప్పుడు నక్సలైట్లు తగ్గడంతో పోడు సాగు చేసుకుంటున్న గిరిజనులను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. వేధింపులను ఆపకపోతే కలెక్టరేట్ ఎదుట రైతులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. రైతుల భూముల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు.