హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మనిషి తనలోని చెడు మీద నిత్యపోరాటం చేస్తూ మంచి దిశగా విజయం సాధించాలనే జీవన తాత్వికతను విజయదశమి మన కు తెలియజేస్తుందన్నారు. దసరా నాడు పాలపిట్టను దర్శించి, శమీవృక్షానికి పూజ చేసి, జమ్మి ఆకును బంగారంలా భావించి పెద్దలకు సమర్పించుకుని వారి ఆశీర్వాదం తీసుకోవడం, గొప్ప భారతీయ సాంస్కృతిక ఆచారమని కేసీఆర్ పేరొన్నారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో దసరా పండుగకు ప్రత్యేక స్థానమున్నదని తెలిపారు. అలయ్ -బలయ్ తీసుకుని పరస్పర ప్రేమాభిమానాలను పంచుకోవడం ద్వారా ప్రజల నడుమ సామాజిక సామరస్యం ఫరిడ విల్లుతుందని పేర్కొన్నారు.
ప్రజలు తాము నిర్వర్తించే వృత్తులకు సంబంధించిన పరికరాలు, వినియోగించే వాహనాలను ఆయుధ పూజ చేసి గౌరవించుకునే గొప్ప సంప్రదాయం దసరా ప్రత్యేకతగా తెలిపారు. పాలపిట్టను రాష్ట్రపక్షిగా, జమ్మిచెట్టును రాష్ట్ర వృక్షంగా గుర్తించడంతో పాటు దసరా పండుగ విశిష్టతను చాటే దిశగా బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్ల పాలనలో పలు కార్యక్రమాలు చేపట్టిందని కేసీఆర్ గుర్తుచేశారు. తాము ఎంచుకున్న సమున్నత లక్ష్యాలను చేరుకుని విజయం సాధించేలా ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలని దసరా సందర్భంగా కేసీఆర్ ప్రార్థించారు.