మల్యాల, మే 30 : కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో గురువారం హనుమాన్ పెద్ద జయంత్యుత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అర్చకులు, వేదపండితులు మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు చేసి ఉత్సవాలను ప్రారంభించారు. భద్రాద్రి ఆలయ ఈవో రమాదేవి, ఉపప్రధాన అర్చకులు గోపాలకృష్ణాచార్యులు, అర్చకులు అమరవాది వెంకటరాఘవన్ ఆంజనేయస్వామికి పట్టువస్ర్తాలు సమర్పించారు. ఆమెకు ఆలయ ఈవో ఆకునూరి చంద్రశేఖర్, ఉత్సవ ప్రత్యేకాధికారి వినోద్‌రెడ్డి నేతృత్వంలో భక్తులు ఎదుర్కోళ్లతో అపూర్వ స్వాగతం పలికారు. కళాకారుల కోలాటాలు, ఒగ్గుడోలు విన్యాసాలు, శివసత్తుల పూనకాల నడుమ భద్రాద్రి ఆలయ పట్టువస్ర్తాలను ఎదుర్కొన్నారు. అర్చకులు మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆశీర్వచన మండపంలో ఉత్సవమూర్తులను పల్లకీపై ఉంచి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టువస్ర్తాలు సమర్పించిన భద్రాద్రి ఆలయ అధికారులు, అర్చకులను హనుమాన్ ఆలయ కమిటీ ఘనంగా సత్కరించగా అర్చకులు పూజలు చేయించి తీర్థప్రసాద వితరణ చేశారు. ఉత్సవాల తొలిరోజే మాల విరమణ మండపాన్ని తెరిచారు. పెద్దసంఖ్యలో దీక్షాపరులు దీక్షలను విరమించారు.