ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 19 : గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేసి పోస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు శుక్రవారం టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓయూ జేఏసీ నాయకుడు హన్మంతునాయక్ను పోలీసులు ముందస్తు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా హన్మంతునాయక్ మాట్లాడుతూ.. గ్రూప్-1, 2 పోస్టులను పెంచాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మరింత ఉద్యమిస్తామని హెచ్చరించారు.
హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ) : జీవో 317పై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం వాయిదా పడింది. మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌తో కూడిన కమిటీ సమావేశం శుక్రవారం జరగాల్సి ఉన్నది. మంత్రులు రైతు భరోసాపై అభిప్రాయ సేకరణలో భాగంగా జిల్లాల పర్యటనలో ఉన్నందున సమావేశం వాయిదాపడినట్టు అధికారులు తెలిపారు. తిరిగి సోమవారం నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలిసింది.