హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): చేనేత రుణమాఫీ నిధులను వెంటనే విడుదల చేయాలని చేనేత కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మంత్రుల క్వార్టర్స్‌లో అఖిల భారత పద్మశాలి సంఘం, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం, చేనేత విభాగం ఆధ్వర్యంలో పలువురు నాయకులు మంత్రి తుమ్మలకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొన్ని జిల్లాల రుణమాఫీ జాబితా ఆలస్యంగా అందడం వల్ల నిధుల విడుదల ఆలస్యమైనట్టు చెప్పారు. సంబంధిత ఫైల్‌ను ఆర్థిక శాఖకు పంపామని, త్వరలోనే నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, సకాలంలో సమస్యలు పరిష్కారం కాకుంటే మెరుపు ధర్నా నిర్వహిస్తామని చేనేత కార్మికులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి, సెక్రటరీ జనరల్ గడ్డం జగన్నాథం, అఖిల భారత పద్మశాలి సంఘం యువజన విభాగం జాతీయ ఇన్చార్జి అవ్వారి భాసర్, తెలంగా ణ ప్రాంత పద్మశాలి సంఘం చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కందగట్ల భిక్షపతి, బొడ్ల తిరుపతి, రంగారెడ్డి జిల్లా చేనేత కార్మిక సంఘం ఎల్బీనగర్ చెరుకు స్వామి పాల్గొన్నారు.