హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): ‘హాల్టికెట్లు వచ్చాయి.. తీసుకెళ్లండి అంటూ విద్యార్థులకు వాట్సాప్ సందేశం. తీరా కాలేజీకి వెళితే అటెండెన్స్ తక్కువవుంది. రూ. 2వేలు కట్టండి అంటున్నారు. ఏ నిబంధనల ప్రకారం తీసుకొంటున్నారని విద్యార్థులు ప్రశ్నిస్తే.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి. ఏం చే సుకుంటారో చేసుకోండి..’ అంటూ బెదిరింపులు. ఇది హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని ఓ లా కాలేజీ వ్యవహారం. ఇలా అ‘న్యాయం’గా ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీపై చర్యలేవీ అంటూ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.
మూడేండ్ల ఎల్ఎల్బీ మొదటి సెమిస్టర్ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. విద్యార్థులు పరీక్ష ఫీజులు కూడా చెల్లించారు. ఉస్మానియా యూనివర్సిటీ వీరికి హాల్టికెట్లు కూడా జారీచేసింది. ఈ కాలేజీలో 360 మంది విద్యార్థులున్నారు. వీరిలో మెజారిటీ విద్యార్థుల నుంచి కాలేజీ యాజమాన్యం తలా రూ. 2వేల చొప్పున వసూలు చేసింది. మొత్తంగా అటెండెన్స్ ఫీజుల రూపంలోనే ఈ కాలేజీ లక్షలు పోగేసుకుంది. తీసుకున్న ఫీజులకు రసీదులు కూడా ఇవ్వడంలేదు.
అటెండెన్స్ లేకపోతే యూనివర్సిటీల్లోనే రూ. 200-300 వసూలు చేస్తుండగా, వేలకు వేలు వసూలు చేయడంపై ప్రశ్నిస్తే చాలా దురుసుగా వ్యవహరించినట్టు విద్యార్థులు వాపోయారు. ఇటీవలే ఢిల్లీ హైకోర్టు 75% హాజరు నిబంధనను సడలించాలని తీర్పు ఇచ్చింది. అయినా వే లకు వేలు వసూలు చేయడాన్ని విద్యార్థి సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఎవరైనా తమకు ఫిర్యాదు చర్యలు తీసుకుంటామని ఓయూ లా విభాగం డీన్ ప్రొఫెసర్ ఎన్ వెంకటేశ్వర్లు ‘నమస్తే తెలంగాణ’కు చెప్పారు.