హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్: చెట్లు.. ప్రకృతి ప్రసాదించిన వైద్యులు అని, అవి బాగుంటేనే.. మనమంతా బాగుంటామని రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు సంతోష్‌కుమార్ పేర్కొన్నారు. ‘నేషనల్ డాక్టర్స్ డే’ సందర్భంగా, 60 మందికి పైగా ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలకు చెందిన ప్రముఖ వైద్యులు గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో పాల్గొనడం గొప్ప విషయమని ఆనందం వ్యక్తంచేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం విధిగా భావించాలని, భావి పౌరులకు గ్రీన్ ఇండియాను అందించడం బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ విలువను గుర్తించిన మనం, ప్రాణవాయువును ఉచితంగా విడుదల చేసే మొక్కలను నాటడంతోపాటు సంరక్షించడం ముఖ్యమని తెలిపారు.
గురువారం ‘నేషనల్ డాక్టర్స్ డే’ను పురస్కరించుకొని గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు. ఫిల్మ్‌నగర్‌లోని సాయిబాబా దేవాలయం సమీపంలోని చిల్డ్రన్ పార్క్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ జీ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్, గాంధీ, నిమ్స్, ఉస్మానియా, కోఠి ఈఎన్టీ దవాఖానల సూపరింటెండెంట్లు రాజారావు, మనోహర్, నాగేందర్, శంకర్, వైద్యులు పద్మజ, అలిమేలు, యశోద దవాఖాన ఎండీ జీ సురేందర్‌రావు, ఎంవీ రావు, ఏఐజీ దవాఖాన ఎండీ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి, స్టార్ దవాఖాన ఎండీ డాక్టర్ గోపీచంద్, కిమ్స్ ఎండీ డాక్టర్ భాస్కర్‌రావు, రెయిన్బో ఎండీలు రమేశ్ కంచర్ల, దినేశ్ కంచర్ల, సన్‌షైన్ ఎండీ డాక్టర్ గురవారెడ్డి, ప్రముఖ వైద్యులు సంజయ్ కల్వకుంట్ల, ప్రీతి, అపోలో, కాంటినెంటల్, మెడికవర్, విరించి తదితర దవాఖానలకు చెందిన ప్రముఖులు, వైద్యనిపుణులు పాల్గొన్నారు. వీరంతా ఎంపీ సంతోష్‌కుమార్‌తో కలిసి మొక్కలు నాటి సెల్ఫీలు తీసుకున్నారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. నేషనల్ డాక్టర్స్ డే రోజును ఇంత గొప్పగా నిర్వహించిన ఎంపీ సంతోష్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం స్ఫూర్తితో గ్రీన్ ఇండియా చాలెంజ్ వంటి మంచి కార్యక్రమాన్ని ప్రారంభించి, గ్రీన్ కవర్ పెంచేందుకు అలుపెరుగని కృషిచేయడం గొప్ప విషయమని అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో సమిష్టిగా కృషి చేస్తున్నామనే సందేశాన్ని వైద్ములు ఇస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని గ్రీన్ ఇండియా చాలెంజ్ సంస్థ తరఫున రాఘవ, కరుణాకర్‌రెడ్డి, కిశోర్‌గౌడ్ పర్యవేక్షించారు.