హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): ప్రఖ్యాత గైనకాలజిస్ట్ డాక్టర్ కొత్త ఉషాలక్ష్మి (91) మంగళవారం తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో ఆమె మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె స్వస్థలం ఏపీలోని గుంటూరు. గైనకాలజిస్ట్‌గా తెలుగు రాష్ర్టాల్లో మంచి గుర్తింపు సాధించారు. హైదరాబాద్‌లోని నిలోఫర్ దవాఖానలో సుదీర్ఘకాలం పాటు సేవలు అందించారు. 69 ఏండ్ల వయసులో బ్రెస్ట్ క్యాన్సర్ బారినపడ్డారు. ఆ వయసులోనూ ఆమె ఎంతో ధైర్యంగా దానిని ఎదుర్కొని, విజయవంతంగా బయటపడ్డారు.
ఆ తర్వాత ప్రాథమిక దశలోనే బ్రెస్ట్ క్యాన్సర్‌ను గుర్తించడంపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించారు. ఇందుకోసం హైదరాబాద్‌లోని కిమ్స్ దవాఖానలో ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్‌ను 2007లో ప్రారంభించారు. ఆమె స్ఫూర్తితో ఆమె కుమారుడు, పద్మశ్రీ డాక్టర్ రఘురాం, కోడలు డాక్టర్ వైజయంతి బ్రిటన్‌లోని తమ కెరియర్ను వదిలిపెట్టి హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. కిమ్స్-ఉషాలక్ష్మి క్యాన్సర్ సెంటర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.