హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తేతెలంగాణ): చట్టసభల్లో జరిగే చర్చలపై ప్రజల్లో గౌరవభావం తగ్గుతున్నదని, శాసనసభలు నిజమైన చర్చా వేదికలుగా కొనసాగినప్పుడే ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. బెంగళూరులో జరుగుతున్న 11వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్(సీపీఏ) ఇండియా రీజియన్ సమావేశాల్లో తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్‌ముదిరాజ్, లేజిస్లేటివ్ సెక్రటరీ డాక్టర్ వీ నరసింహాచార్యులు, అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ చట్టసభ్యులు ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రజల ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూ చర్చలు జరిపితే చట్టసభలపైనా, ప్రజా ప్రతినిధులపైనా ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని చెప్పారు.