నల్లగొండ, అక్టోబర్ 16: సీఎం కేసీఆర్ విడుదల చేసిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టో సకల జనులకు మేలు చేసేలా ఉన్నదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని తయారు చేశారని తెలిపారు. సోమవారం ఆయన నల్లగొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. మహిళల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సౌభాగ్యలక్ష్మి పేరుతో వారికి సాయం చేయడం సంతోషకరమని అన్నారు. ఆసరా పింఛన్లతో ఇప్పటికే ఆపన్నులు సంతోష పడుతుంటే.. వారికి మరింత మేలు చేసేలా నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామమన్నారు. కాం గ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ఎవరూ నమ్మే పరిస్థితి లేదని అన్నారు. ఈ ఆరు గ్యారెంటీ పథకాలను కాం గ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయ డం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని, రేవంత్‌తోపాటు బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాటలు గాలికే పోతాయని అన్నారు. రాష్ట్రంలో పెట్టిన పథకాలనే కేంద్రం కాపీ కొట్టి వాటిని పాక్షికంగా అమలు చేస్తున్నదని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ను విమర్శించే హక్కు బీజేపీకి లేదని, వారు తమ పాలిత ప్రాంతాల్లో ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. అక్కడ చేయని అభివృద్ధి ఇక్కడ చేస్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను అర్థం చేసుకొని మరోసారి ఆదరించి ఓటు వేయాలని ప్రజలను కోరారు. బీఆర్ఎస్ గెలిస్తే అమలవుతున్న పథకాలతోపాటు కొత్త పథకాలు వచ్చే అవకాశం ఉన్నందున మరోసారి కేసీఆర్‌ను సీఎం చేయడానికి మద్దతు ఇవ్వాలని కోరారు.