నల్లగొండ, జూలై 4 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో విపక్షాలు కలువడం, మోదీ సర్కార్‌ను గద్దె దింపడం కాంగ్రెస్ పార్టీ ముఖ్యులకు ఇష్టం లేదని శాసన మండలి చైర్మ న్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. దేశానికి సారథ్యం వహించే సమర్థత రాహుల్‌గాంధీకి లేదని, వేరే వాళ్లకు ఆ బాధ్యతలు అప్పగించేందుకు మనసు రాదని పేర్కొన్నారు. అందుకే విపక్షాలు కలిసే పాట్నా సమావేశానికి బీఆర్ఎస్ను వద్దన్నారని తెలిపారు. ఓ వైపు బీఆర్ఎస్ను కాంగ్రెస్ వాళ్లే వద్దం టూ.. మరోవైపు బీజేపీకి బీ టీమ్ అంటూ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. మంగళవారం ఆయన నల్లగొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. కర్ణాటక ఎన్నికల తర్వాత దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విచిత్రంగా ప్రవర్తిస్తున్నదని విమర్శించారు. రాష్ట్రంలో తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనపై విద్వేషపూరిత ప్రచారం చేస్తున్నారని, దేశంలో ఎన్డీయే సర్కార్ వచ్చేందుకు ఆ నాటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే కారణమని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టలేక విదేశాలకు పారిపోయిన రాహుల్‌గాంధీ సీఎం కేసీఆర్‌ను విమర్శించడంపై ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. అధికార యావతో కేసీఆర్ పాలనపై ఈర్షాద్వేషాలతోనే ఖమ్మం సభలో కాంగ్రెస్ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడారని విమర్శించారు. ఖమ్మం సభలో చెప్పిన పథకాలు కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌లో ఐక్యతారాగం గాలి బుడగ లాంటిదని, ఖమ్మం సభలో రాహుల్‌గాంధీ ముందే భట్టి విక్రమార్కను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నెట్టివేసిన తీరు అందుకు నిదర్శనమని చెప్పారు. ఇలాంటి గుంపుల నేతలు రాష్ర్టాన్ని పాలిస్తారా? ప్రజలు ఆలోచించాలని కోరారు. కేసీఆర్‌తోనే రాష్ట్రం సురక్షితంగా, సుభిక్షంగా ఉంటుందని తెలిపారు.