సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 02, 2020 , 01:15:44

కేంద్రానికి చట్టాలంటే అగౌరవం

కేంద్రానికి చట్టాలంటే అగౌరవం
  • డీలిమిటేషన్‌ విషయంలో మాటతప్పడం సరికాదు
  • పట్టణ ప్రగతిపై విమర్శల్లో అర్థం లేదు
  • మీడియా సమావేశంలో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి

నల్లగొండ, నమస్తే తెలంగాణ: ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో డీలిమిటేషన్‌కు సంబంధించి బీజేపీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడటం విభజన చట్టాలను అగౌరవపర్చడమేనని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్‌ కేవలం జమ్ముకశ్మీర్‌కే వర్తిస్తుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడటం లో అర్థంలేదని చెప్పారు. విభజన విషయం లో రాత్రిళ్లు ఒప్పందం చేసుకున్నారని కిషన్‌రెడ్డి అనడం విడ్డూరంగా ఉన్నదన్నారు.


 పునర్విభజన చట్టాన్ని గౌరవించి తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో అసెంబ్లీ స్థానాలను పెంచేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కేంద్రంపై ఉన్నదన్నారు. అప్పట్లో లోక్‌సభ, రాజ్యసభలోనూ డీలిమిటేషన్‌పై తీర్మానం చేశారని.. ప్రస్తుతం బీజేపీ పట్టించుకోకపోవడం సరికాదన్నారు. పల్లె-పట్టణ ప్రగతి కార్యక్రమాలు రాజకీయాలకతీతంగా జరుగుతున్నాయని, వీటిపైనా పలువురు అర్థంలేని విమర్శలు చేస్తున్నారని అన్నారు. డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులందరి సహకారంతో రాష్ట్రంలోని అన్నిప్రాంతాల్లో ఏకగ్రీవమవ్వడం మంచి పరిణామంగా అభివర్ణించారు.  


logo