నందికొండ, మే 6: కాంగ్రెస్, బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకొని తెలంగాణ ప్రతిష్ఠను దిగజారుస్తున్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మండిపడ్డారు. ఎనిమిదేండ్ల బీజేపీ పాలనలో దేశం తిరోగమనంలో పయనిస్తున్నదని ఆరోపించారు. దేశానికి కావాల్సిం ది డబుల్ ఇంజిన్ సర్కారు కాదని, నిత్యావసరాల ధరలను నియంత్రించే ప్రభుత్వం కావాలని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా నందికొండ విజయవిహార్‌లో శుక్రవారం గుత్తా మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చేయని విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు దేశాన్ని భ్రష్టుపట్టించాయని ధ్వజమెత్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశం వెనుకకు వెళ్తున్నదని దుయ్యబట్టారు.
దేశ జీడీపీ శాతం బంగ్లాదేశ్ కన్నా తక్కువగా ఉన్నదని, ఆహార సమస్య, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న దేశాల జాబితాల్లోకి భారత్ చేరిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎనిమిదేండ్లలో డీజిల్, పెట్రోల్, గ్యాస్, నిత్యావసరాల ధరలు అత్యధికంగా పెరిగాయని, ధరలను నియంత్రించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉన్న డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు ట్రబుల్ ఇంజిన్ సర్కార్లుగా మారాయని ఎద్దేవాచేశారు. సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును స్వయంగా కేంద్రమంత్రులు ప్రశంసిస్తుంటే.. ఆ పార్టీ రాష్ట్ర నాయకులు అవాకులుచవాకులు పేలుతున్నారని ధ్వజమెత్తారు.
రైతు సంఘర్షణ సభ ఎందుకు?
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దారుణంగా మారిందని, రాహుల్‌గాంధీని రాష్ర్టానికి తీసుకొచ్చి రైతు సంఘర్షణ సభ ఎందుకు పెడుతున్నారో వారికే తెలియదని గుత్తా ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు, మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసే దమ్ము ఉన్నదా? అని సవాల్ చేశా రు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి యాదా ద్రి పునర్నిర్మాణంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. భారీ స్థాయిలో ఆలయ నిర్మాణం చేసినప్పడు చిన్నచిన్న సమస్యలు వస్తాయ ని, వాటిని భూతద్దంలో చూపడం సరికాదని హితవు పలికారు. తెలంగాణ కోసం రాజీనామా చేయనని పారిపోయిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నీతులు చెప్పడం విడ్డూరంగా ఉన్నదన్నారు. రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీ నేతలు కేంద్రం నుంచి రావలసిన నిధులు, నిమామకాల గురించి మాట్లాడాలని సూచించారు.