నల్లగొండ, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అధికారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చావు కోరుతారా? అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాలేదన్న ప్రస్టేషన్లో రేవంత్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరికాదని అన్నారు. పార్టీలకు సమాధులు కడతామనడం, కేసీఆర్‌కు పిండాలు పెడతామంటే చావును కోరడమే కదా అని ప్రశ్నించారు. చంద్రబాబు డైరెక్షన్లో రేవంత్ సిపాయిగా పనిచేస్తున్నాడని విమర్శించారు. బుధవారం నల్లగొండలోని తన నివాసంలో గుత్తా మీడియాతో మాట్లాడారు. ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణను సాధించి, నేడు నంబర్ వన్ రాష్ట్రంగా నిలిపిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే వేలాది మంది బలిదానాలు చేసుకోవాల్సి వచ్చింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడైనా తెలంగాణ వారిని సీఎం కుర్చీలో ఐదేండ్ల పదవీ కాలాన్ని పూర్తి చేయనిచ్చారా? అని నిలదీశారు. ఉద్యమం సమయంలో తామంతా కాంగ్రెస్‌లో ఉన్నా కేసీఆర్ స్ఫూర్తితోనే రాష్ట్రం కోసం పోరాడినట్టు చెప్పారు. తెలంగాణలో ఓట్లడిగే నైతిక హక్కు బీజేపీకి లేదని అన్నారు. ఏ అంశాన్ని తీసుకున్నా తెలంగాణ కోసం బీజేపీ చేసింది శూన్యమని చెప్పారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్‌ను తిట్టడమే ఎజెండాగా పెట్టుకొని ఓట్లు అడగాలనుకుంటే ప్రజలు క్షమించబోరని హెచ్చరించారు.