నల్లగొండ: కాంగ్రెస్ పార్టీపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) ఫైరయ్యారు. అధికారం కోసమే కాంగ్రెస్ (Congress) వాళ్లు దురాలోచన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీకి అధికారం ఇస్తే తెలంగాణ (Telangana) అధోగతి పాలవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో పదవులు లేని నిరుద్యోగులు నల్లగొడలో (Nalgonda) ర్యాలీ నిర్వహించి నానా హంగామా చేశారని విమర్శించారు. నల్లగొండలోని తన నివాసంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పెద్దసంఖ్యలో భర్తీచేస్తున్న ఉద్యోగాలు కాంగ్రెస్ వాళ్లకు కనబడటం లేదా అని ప్రశ్నించారు. ఆ పార్టీ నాయకులు సిగ్గులేకుండా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. 2018లో తన స్నేహితుడు కంచర్ల భూపాల్ రెడ్డి చేతిలో కోమటిరెడ్డి చిత్తుగా ఓడిపోయాడని.. అయినా బుద్ధి మారలేదన్నారు. ఆయన తమ్ముడు రాజగోపాల్‌ని, అన్న మోహన్ రెడ్డిలను కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు తుక్కుగా ఓడిచించారని గుర్తుచేశారు. స్థిరత్వం లేని కోమటిరెడ్డిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని, ఆయనకు పిచ్చి ముదిరిందన్నారు. ఉదయం బీఆర్ఎస్ పార్టీలోకి వస్తానని మధ్యాహ్నం కాంగ్రెస్, సాయంత్రం బీజేపీ అమిత్ షాతో మాట్లాడుతున్నారని ఎద్దేశా చేశారు. ఐదెకరాల భూమి ఉందన్న కోమటిరెడ్డికి హైదరాబాద్‌లో విల్లాలు, ఇతర ఆస్తులు ఎక్కడివని నిలదీశారు.
సీఎఉం కేసీఆర్ నాయకత్వంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని చెప్పారు. రెండు మెడికల్ కాలేజీలు, పవర్ ప్లాంట్, యాదాద్రి ఆలయం, ఐటీ హబ్, ప్రాజెక్టులు ఇలా ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధికి ముఖద్వారంగా నిలిచిందని తెలిపారు. సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలతో ఎస్సారెస్పీ కాలువల్లో గోదావరి జలాలు పారుతున్నాయని వెల్లడించారు. పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొంటున్నదని చెప్పారు. ఉమ్మడి జిల్లాలో రెండు పంటలకు నీళ్లిచ్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.65 వేల కోట్ల రైతు బంధు, అకాల వర్షానికి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు ఇస్తున్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీ నేతలు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి, తనపై నిరాధార ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బురద జల్లడం వారికి అలవాటయిందన్నారు. గతంలో చేసిన బ్లాక్ మెయిల్ విధానాలు అనుసరించే వారికి అధికారం ఇస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరే అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో అలాంటి వారికి సరైన గుణపాఠం చెప్పాలని గుత్తాసుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణకు సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని చెప్పారు.