Gutha Sukender Reddy: రాజకీయ నాయకులు మాట్లాడే భాష వింటున్న ప్రజలు చీదరించుకుంటున్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. రాజకీయాల్లో భాషా వ్యవహారం పూర్తిగా దిగజారిందని అసహనం వ్యక్తం చేశారు. ప్రతి నాయకుడు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. పార్టీలకు అతీతంగా నాయకులు మాట్లాడే భాష మార్చుకోవాలని సూచించారు. తద్వారా తమ గౌరవాన్ని నిలుపుకోవాలని చెప్పారు. నల్లగొండలోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నాయకులు ఇప్పటికైనా తమ భాషను మార్చుకోవాలన్నారు.
ఉచిత పథకాలు రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని చెప్పారు. అందువల్ల ఉచితాలను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. లేనట్లయితే దేశ ఆర్థిక వ్యవస్థ నలిగిపోతుందని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా అవినీతి రోజురోజుకు పెరిగిపోతున్నదని తెలిపారు. ఎన్నికల ఖర్చులపై నియంత్రణ లేకపోవడమే అవినీతి పెరుగుదలకు ప్రధాన కారణమన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలని వ్యాఖ్యానించారు. బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుందని చెప్పారు. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. నేతల మధ్య పరస్పర దాడులు మంచివికాదని, సభ బయట సభ్యుల మధ్య జరిగే దాడులపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని వెల్లడించారు.