నల్లగొండ: పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌తో తాడోపేడో తేల్చుకోవాలన్న అభిప్రాయం ప్రజల్లో కనిపిస్తున్నదని, అయితే పాక్‌తో యుద్ధం కంటే ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. పాకిస్థాన్ తమ భూభాగంలో ఉన్న ఉగ్రవాదులు, వారి నాయకులను అప్పగించాలన్నారు. పాక్ ప్రభుత్వ నేతల మాటలు రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. జనగణనలోనే కులగణన చేపట్టాలని కేంద్రం నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నాని చెప్పారు. వివిధ రాష్ట్రాల్లో సామాజిక నేపథ్యాల కారణంగా కులాల రిజర్వేషన్ అమల్లో ఉందని తెలిపారు. ఈ అంతరాన్ని ఎలా తొలగిస్తారో స్పష్టత నివ్వాలన్నారు. అందరికంటే ముందుగానే కుల గణన చేపట్టిన తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించారు. 2014 పునర్విభజన చట్టంలో నియోజకవర్గాల పునర్విభజన అమలు చేస్తామని హామీనిచ్చారు. ఆ తర్వాత జమ్ముకశ్మీర్‌లో చేశారు. కానీ విభజన చట్టం ప్రకారం అవకాశం ఉన్నా తెలంగాణ, ఏపీలో ఇప్పటి వరకూ చేయలేదని వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్రం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నదని విమర్శించారు. 2026 కులగణన తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని సుప్రీంకోర్టుకు కేంద్రం చెప్పింది. తమకు ఇష్టమైన రాష్ట్రంలో ఒకతీరుగా.. ఇష్టం లేనీ రాష్ట్రంలో మరో తీరుగా కేంద్రం వైఖరి ఉంది. పదవులు, అధికారులు ఎవరికీ శాశ్వతం కాదు. చాలా సందర్భాల్లో ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతున్నది. ప్రొటోకాల్ వివాదాలు తలెత్తకుండా చూసుకోవాలి. ఎటువంటి అనుమానం లేకుండా త్వరలోనే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తవుతుంది. టన్నెల్ ప్రమాదం వల్ల కొంత అలస్యం జరిగే అవకాశం ఉంది. తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన పోరాటాన్ని కాదనలేమని చెప్పారు. అందుకే ప్రజలు వారికి పదేండ్లు అధికారాన్ని ఇచ్చారన్నారు. కానీ అందరి పోరాటాన్ని గుర్తించాలని చెప్పారు. తెలంగాణ ప్రజలు విశ్వాసం కలిగినవారని, దానిని పోగొట్టొద్దని సూచించారు. రాజ్యాంగం ప్రకారం చట్టసభలే సుప్రీం అని చెప్పారు.