హైదరాబాద్, సెప్టెంబర్14 (నమస్తే తెలంగాణ): ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ, జనరల్ మొత్తంగా ఐదు సొసైటీ పరిధిలోని గురుకులాల్లో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 28న చాక్ డౌన్‌కు గురుకుల విద్యా జేఏసీ పిలుపునిచ్చింది. ప్రభుత్వం వెంటనే స్పందించాలని అల్టిమేటం జారీ చేసింది.
గురుకుల జేఏసీలో భాగస్వామ్యమైన టీఎస్‌డబ్ల్యూఆర్‌టీఈఏ అధ్యక్షుడు సీహెచ్ బాలరాజు, స్టాఫ్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభుదాస్, టీఎస్‌డబ్ల్యూఆర్‌టీయూ బాలస్వామి, ఏటీజీఆర్ఐఈడబ్ల్యూఏ యాదయ్య, ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ చలపతి, టీటీఆర్ఈఐటీఏ రుషికేష్కుమార్, టీఆర్ఈఐటీఏ గోవర్ధన్‌రెడ్డి, టీఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఝాన్సీరాణి, టీఆర్డీసీఈఏ సాంబలక్ష్మి, టీజీఎస్డబ్ల్యూఆర్ఈటీఎల్ఏ ఆవుల సైదులు, పీడీ అసోసియేషన్ వీ చందర్ శనివారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
గురుకుల విద్యార్థులతోపాటు ఉపాధ్యాయ, ఉద్యోగవర్గం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నదని, ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం స్పందించడం లేదని విద్యాజేఏసీ వాపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళన బాట పట్టాల్సి వస్తున్నదని వివరించింది. సమస్యల పరిష్కారానికి దశలవారీగా శాంతియుతంగా ఆందోళనలను చేపట్టాలని నిర్ణయించినట్టు వెల్లడించింది. 17న నల్లాబ్యాడ్జీలతో, 19న ఉపాధ్యాయులంతా సంతకాలు చేసి ఆ వినతులను ప్రిన్సిపాల్స్ ద్వారా సొసైటీ కార్యదర్శులకు సమర్పించాలని నిర్ణయించింది. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే పెన్‌డౌన్, చాక్డౌన్లో భాగంగా 28న విధులను బహషరించాలని గురుకుల ఉపాధ్యాయులకు జేఏసీ పిలుపునిచ్చింది.