పెద్దఅంబర్‌పేట, నవంబర్ 1: గురుకుల విద్యార్థులు రోడ్డెక్కారు. తమ సమస్యలపై గళం విప్పారు. ముషీరాబాద్, చార్మినార్ మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల క్యాంపస్‌ను రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారం గ్రామ పరిధిలో నిర్వహిస్తున్నారు.
గురుకులంలో వసతులు లేవని, చదువులు సరిగా చెప్పడం లేదని, ఆహారం సరిగా ఉండటంలేదని విద్యార్థులు శుక్రవారం దాదాపు కిలోమీటర్ నడిచివచ్చి బాటసింగారం వద్ద కొత్తగూడ చౌరస్తాలో జాతీయ రహదారిపై బైఠాయించి తమ సమస్యలను తీర్చాలని నినదించారు.
న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఓ వైపు అతివేగంగా వెళ్తున్న వాహనాల పక్కనే కూర్చొని ధర్నాకు దిగడం ఆందోళన కలిగించే విషయం. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాల్సిన ప్రభుత్వం.. ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం దారుణమని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గుండె శివకుమార్ మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.