హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ) : జేఈఈ మెయిన్1 ఫలితాల్లో గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. గతంలో మాదిరిగానే ఈ ఏడాది కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పరీక్షలో అర్హత సాధించారు. ఎస్సీ గురుకులాలకు చెందిన 1,492 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 698 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఇందులో 21 మంది విద్యార్థులు 90 పర్సంటైల్, 111 మంది 80 పర్సంటైల్, 227 మంది 70 పర్సంటైల్ సాధించారని ఎస్సీ గురుకులాల సొసైటీ వెల్లడించింది. ఇందులో పల్లవి 98.48, రామకృష్ణ 98.34, రంజిత్ 98.32, విష్ణు 94.21, లోకేశ్ 94.06 పర్సంటైల్ సాధించినట్టు తెలిపింది.
గిరిజన గురుకులాలకు చెందిన 773 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, 510 మంది అర్హత సాధించారు. అందులో 16 మంది విద్యార్థులు 90 పర్సంటైల్, 59 మంది 80 పర్సంటైల్, 114 మంది 70 పర్సంటైల్ సాధించారని గురుకుల అధికారులు తెలిపారు. వీరిలో లోకేశ్ 96.18, చంటి 95.73, బాలాజీ 94.82, ఉపేందర్ 93.41, సందీప్ 92.32 పర్సంటైల్‌తో గిరిజన గురుకుల టాపర్లుగా నిలిచారని వెల్లడించారు. బీసీ గురుకులాల నుంచి 329 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, ఇందులో 120 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఈ సందర్భంగా అర్హత సాధించిన విద్యార్థులను బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్ ప్రత్యేకంగా అభినందించారు. మెయిన్ ఫైనల్ పరీక్షలోనూ సత్తా చాటాలని ఆకాంక్షించారు.