హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): రేవంత్‌రెడ్డి పాలనలో గురుకులాలు అధఃపాతాళానికి చేరుకుంటున్నాయని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థులు తమ టాయిలెట్లను తామే కడుక్కోవాలన్న ఎస్సీ గురుకులాల సొసై టీ కార్యదర్శి అలుగు వర్షిణి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. శనివారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ దళిత విద్యార్థులను టాయిలెట్లు కడుక్కోమనడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. రేవంత్, మం త్రులు కూడా వారి టాయిలెట్లను వారే కడుక్కుంటున్నారా? అని ప్రశ్నించారు. వారి పిల్లలు చదువుతున్న స్కూళ్లలో ఇలాగే కడిగిస్తున్నారా? అని నిలదీశారు. ఎస్సీ విద్యార్థులపై సొసైటీ అధికారి వివక్ష ప్రదర్శిస్తున్నా డిప్యూటీ సీఎం, మంత్రి దామోదర.. రేవంత్‌రెడ్డికి బానిసల్లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గురుకుల విద్యార్థిని నందినికి గోల్డ్ మెడల్ వస్తే నగదు ప్రోత్సాహకం, ఇంటి స్థలం ఎందుకివ్వలేదో చెప్పాలన్నారు.
ఇంటర్ విద్యార్థులను బయటకు పంపుతారా?
గౌలిదొడ్డి గురుకుల పాఠశాల సిబ్బందిని తొలగించడంతోపాటు ఇంటర్ సెకండియర్ విద్యార్థులను బయటకు పంపాలని ఆదేశాలివ్వడం దారుణమని ప్రవీణ్‌కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ హయాంలో 30 గురుకుల మహిళా డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేస్తే, కాంగ్రెస్ హయాంలో వాటిలో ఇప్పటి వరకు ఒక్క అడ్మిషన్ కూడా లేదని ప్రవీణ్‌కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు.
కేర్ టేకర్ల తొలగింపు
గురుకులాల్లో కేసీఆర్ ఏర్పాటు చేసిన కేర్ టేకర్లను రేవంత్ ప్రభుత్వం తొలగించిందని ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. సమ్మర్ క్యాంపులను కూడా రద్దు చేశారని, వాటిలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్, పార్ట్‌టైం ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.