హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా మొదటి తారీఖునే వేతనం చెల్లిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేస్తున్న ప్రకటన పచ్చి అబద్ధమని గురుకుల టీచర్లు మండిపడుతున్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాల్లో రెగ్యులర్ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందితో పాటు, ఔట్సోర్సింగ్ ద్వారా ఆయా విభాగాల్లో వేలాది మంది విధులు నిర్వర్తిస్తున్నారు. అక్టోబర్‌కు సంబంధించి మైనార్టీ, సోషల్ వెల్ఫేర్ గురుకుల సిబ్బందికి ఇప్పటికీ వేతనాలు చెల్లించలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 22 నెలల్లో ఒకే ఒక నెలలో మాత్రమే మొదటి తారీఖున వేతనం అందుకున్నామని తెలిపారు.
ప్రతి నెలా మొదటి వారం, లేదంటే రెండో వారం దాటిన తర్వాతే వేతనాలు చెల్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఫలితంగా బ్యాంక్ రుణాలను సకాలంలో చెల్లించలేక అదనంగా జరిమానాలు చెల్లించాల్సి వస్తున్నదని, సిబిల్ స్కోర్ పడిపోతున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఏ నెల వేతనాలను ఆ నెల చెల్లించకపోవడంతో కుటుంబాలను పోషించలేక అవస్థలు పడాల్సి వస్తున్నదని, అప్పుల పాలవుతున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ప్రతినెలా వేతనాలను సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఉద్యోగులు ఉన్నతాధికారులను నిలదీస్తున్న నేపథ్యంలో ఎస్సీ గురుకుల సొసైటీ ఉన్నతాధికారులు స్పందించారు. ఇటీవల కార్యదర్శి మార్పు, ప్రధాన కార్యాలయ డిజిటలైజేషన్, ఈ-ఫైలింగ్ ప్రక్రియ వల్ల జాప్యమవుతున్నదని వెల్లడించారు. కార్యదర్శి విధుల్లో లేకపోవడంతో వేతనాల విడుదల జాప్యమైందని, అక్టోబర్ 6 తర్వాతనే జీతాలు విడుదలయ్యే అవకాశముందని తెలిపారు.
కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, పార్ట్‌టైం సిబ్బంది సుదీర్ఘకాలంగా వేతనాలు చెల్లించకపోవడంతో సర్కారుపై తిరుగుబావుటా ఎగరవేశారు. ఎస్సీ గురుకుల సొసైటీలోని పార్ట్‌టైం సిబ్బంది భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వంపై నిరసస తెలిపారు. ప్రిన్సిపాళ్లకు వినతిపత్రాలు సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల పార్ట్‌టైం సిబ్బంది రాజీనామాలకు దిగడం సర్కారు తీరుకు అద్దం పడుతున్నది.
గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 268 ఆశ్రమ పాఠశాల్లో 340 మంది అకడమిక్ ఇన్స్ట్రక్టర్లకు 5 నెలలుగా, ఎస్సీ గురుకుల సొసైటీలో 2,469 మంది కాంట్రాక్టు, పార్ట్ టైం, ఔట్సోర్సింగ్, సబ్జెక్ట్ అసోసియేట్లకు 3 నెలలుగా, ట్రైబల్, బీసీ గురుకుల సొసైటీల పరిధిలోని సిబ్బందికి 2 నెలలుగా వేతనాలు చెల్లించలేదు. దీర్ఘకాలంగా వేతనాలను చెల్లించకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సి వస్తున్నదని వాపోతున్నారు. ఇదేమని అడిగితే ప్రభుత్వం ఈ ఏడాదికి సంబంధించి కంటిన్యుయేషన్ ఆర్డర్లు ఇవ్వలేదని, ఐఎఫ్ఎంఎస్లో వివరాలు నమోదు కాలేదని చెప్తూ దాటవేస్తున్నారని మండిపడుతున్నారు.
ఇల్లెందు, అక్టోబర్ 4 : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న డైలీవైజ్, ఔట్ సోర్సింగ్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం 23వ రోజుకు చేరింది. ఇల్లెందు మండలం రొంపేడు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ఎదుట చేపట్టిన దీక్షనుద్దేశించి సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అబ్దుల్నబీ, జేఏసీ నాయకులు మాట్లాడారు. కార్మికుల పది నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని, టైమ్ స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే కార్మికులతో కలిసి ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.