సిరిసిల్ల రూరల్, మార్చి 17: కుక్క దాడిలో విద్యార్థినికి తీవ్రగాయాలైన ఘటన సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్నబోనాల బాలికల గురుకుల స్కూల్లో సోమవారం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవిపదిరకు చెందిన గొట్టిముక్కుల డేవిడ్‌రాజ్ – కృపారాణి కూతురు సువర్ణ (10) చిన్న బోనాల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నది.
సోమవారం బాత్రూం వెళ్లేందుకు పాఠశాల గది నుంచి బయటకు వచ్చి మళ్లీ లోపలికి వెళ్లే సమయంలో ఓ కుక్క దాడి చేసింది. విద్యార్థిని కేకలు వేయడం, తోటి విద్యార్థినులు చెదరగొట్టడంతో కుక్క అక్కడి నుంచి వెళ్లిపోయింది. సువర్ణను వెంటనే సిరిసిల్ల ఏరియా దవాఖానకు తరలించారు. స్కూల్ యాజమాన్యం, వాచ్మెన్ నిర్లక్ష్యంపై తల్లిదండ్రులతోపాటు బీఎస్పీ వీర్నపల్లి మండల అధ్యక్షుడు గజ్జెల ప్రశాంత్ మండిపడ్డారు.
చిన్న బోనాల గురుకుల స్కూల్లో విద్యార్థినిపై కుక్క దాడి ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి గాయపడిన ఘటన రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యాశాఖకు బాధ్యత వహిస్తున్న రేవంత్ రెడ్డి పాలనలో చావు కేకలు పెడుతున్నాయన్నారు. గురుకుల బిడ్డల రోదనలే శాపాలై నీతిలేని అతని పాలనకు చరమగీతం పాడుతాయని హెచ్చరించారు.