మునిపల్లి, సెప్టెంబర్ 9: సంగారెడ్డి జిల్లా లింగంపల్లి శివారులోని గురుకుల పాఠశాలలోని హాస్టల్ భవనం మంగళవారం మధ్యాహ్నం కుప్పకూలింది. ఆ సమయంలో విద్యార్థులు అక్కడ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మధ్యాహ్నం భోజనానికి అదే భవనంలోకి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ముందుగా చేరుకున్న ముగ్గురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. వారం రోజులుగా కురిసిన వర్షానికి భవనం తడిసినట్టు ప్రిన్సిపాల్ చైతన్య తెలిపారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్ వైపు పరుగులుతీశారు. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఇబ్బందులు పడుతున్న విషయమై సంబంధిత ఉన్నత అధికారులకు వినతిపత్రం అందించినట్టు ప్రిన్సిపాల్ తెలిపారు.
ప్రిన్సిపాల్ మాట్లాడుతున్న సమయంలో పలువురు తల్లిదండ్రులు గొడవకు దిగారు. 40 ఏండ్ల క్రితం నిర్మించిన భవనం శిథిలావస్థకు చేరుకున్నా పట్టించుకోరా? అని విరుచుకుపడ్డారు. విద్యార్థుల ప్రాణాలకు హాని జరిగి ఉంటే పరిస్థితి ఏంటని నిలదీశారు. అధికారులు వెంటనే కొత్త భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. భవనం కూలిన విషయం తెలుసుకున్న కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత అధికారులతో కలిసి ఘటనా స్థలాన్ని సందర్శించారు. విద్యార్థులతోనూ మాట్లాడారు. ఎవరూ భయాందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. శిథిల భవనంలో ఉన్న విద్యార్థులను పక్క గదుల్లోకి తరలించాలని అధికారులను ఆదేశించారు. హాస్టల్ నూతన భవన నిర్మాణానికి రూ.7కోట్లతో ప్రతిపాదనలు పంపినట్టు ఆమె పేర్కొన్నారు.