సూర్యాపేట, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): రేవంత్ అజ్ఞాని అని, హార్వర్డ్ యూనివర్సిటీకి పోయినా.. మరెక్కడికి వెళ్లినా జ్ఞానం పెరుగదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. రెండేండ్లుగా ముఖ్యమంత్రిగా పని చేస్తున్నా ఆయన వ్యవహారశైలి ఏ మాత్రం మారలేదని పేర్కొన్నారు. ఎక్కడికి వెళ్లినా సమస్యలపై, ఇచ్చిన హామీలపై మాట్లాడకుండా బూతులు వల్లెవేయడాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు.
సీఎంగా రెండేండ్లు పూర్తి చేసుకున్నా ఎలా పరిపాలించాలో కనీస అవగాహన పెరుగకపోగా, రోజురోజుకూ సంస్కారహీనత పెరిగిపోతుందని మండిపడ్డారు. రేవంత్‌కు గతంలో చంద్రబాబు.. నేడు సోనియాగాంధీ జాతిపితలు అయితే భవిష్యత్తులో మోదీ జాతిపిత కావొచ్చేమోననే అనుమానం వ్యక్తంచేశారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించి కార్యాలయాలు ప్రారంభించడం, బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొని, పలువురిని పార్టీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి సీఎం స్థాయికి తగ్గట్టుగా కాకుండా దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ చేసిన మోసాలు కప్పిపుచ్చేలా గాంధీలా ఆమరణ దీక్ష చేసి తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌పై రోత మాటలు మాట్లాడుతుంటే ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు.
స్వాతంత్య్రం తెచ్చిన గాంధీతో పోలుస్తూ ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్‌ను ప్రజలు తెలంగాణ జాతిపిత అంటున్న విషయాన్ని గుర్తుచేశారు. రేవంత్ రోత మాటలతో బీఆర్ఎస్కు మరింత బలం పెరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ మాటలు నమ్మి ప్రజలు ఇప్పటికే మోయపోయారని, మరోసారి మోసపోకుండా జాగ్రత్త పడాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో అరాచక కాంగ్రెస్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. సూర్యాపేట మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.