Gummadidala | గుమ్మడిదల,మార్చి15 : 39 రోజులుగా డంపింగ్‌యార్డు(ఎంఎస్‌డబ్ల్యూ)రద్దుపై ఆందోళనలు, నిరహారదీక్షలు చేస్తున్న సర్కారు స్పందించకుండా మౌనంగా ఉందని రైతు జేఏసీ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డి సర్కారుపై ధ్వజమెత్తారు. గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి పంచాయతీ పరిధిలోని ప్యారానగర్ సమీపంలో జీహెచ్ఎంసీ అధికారులు రాంకీ సంస్థచే ఏర్పాటు చేయిస్తున్న డంపింగ్‌యార్డు(ఎంఎస్‌డబ్ల్యూ)ను వెంటనే రద్దు చేయాలని చేస్తున్న రిలేనిరహారదీక్షలు గుమ్మడిదల, నల్లవల్లి, కొత్తపల్లి గ్రామాల్లో శనివారానికి 39వ రోజుకు చేరుకున్నాయి.
గుమ్మడిదలలో కానుకుంట గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ నాయకులు రిలే నిరహారదీక్ష చేపట్టారు. నల్లవల్లిలో రైతు మహిళా సంఘాల సభ్యులు రిలే నిరహారదీక్ష చేపట్టారు. కొత్తపల్లిలో గ్రామయువకులు దీక్ష చేపట్టారు. ఈసందర్భంగా రైతు జేఏసీ నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ ప్యారానగర్ డంపింగ్‌యార్డు(ఎంఎస్‌డబ్ల్యూ)కు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
గుమ్మడిద మండల వ్యాప్తంగా 13 గ్రామాల ప్రజలు, అఖిలపక్షాల పార్టీల నాయకులు, అన్ని కులసంఘాలు, యువజన సంఘాలు డంపింగ్‌యార్డుకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని ఆందోళనలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుమ్మడిదల మండల ప్రజల ఓపికను పరీక్షించోద్దని హెచ్చరించారు. ఇకనైనా రాష్ట్ర సర్కారు, జిల్లా యంత్రాంగం స్పందించి డంపింగ్‌యార్డును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రైతు జేఏసీ నాయకులు గోవర్థన్‌రెడ్డి, పుట్ట నర్సింగ్‌రావు, మందభాస్కర్రెడ్డి, సురభి నాగేందర్‌గౌడ్, మాజీ జడ్పీటీసీ కుమార్‌గౌడ్, నక్క వెంకటేశంగౌడ్, కాలకంటి రవీందర్‌రెడ్డి, రైతు సంఘం అధ్యక్షుడు సదానందరెడ్డి, మంద బలరాంరెడ్డి, ఆంజనేయులు యాదవ్, కుమ్మరి ఆంజనేయులు, కొరివి సురేశ్, మన్నెరామకృష్ణ, కొత్తపల్లి మల్లేశ్‌గౌడ్, దేవేందర్‌రెడ్డి, రాజుగౌడ్, రైతు మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.