Telangana | ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 7 : వ్యవసాయం, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం ఒకదానితో ఒకటి ముడిపడిన రంగాలు. ప్రస్తుత ప్రభుత్వ అనాలోచిత చర్యలతో ప్రతి రంగం కుదేలైం ది. దీంతో కార్మికులు, వృత్తిదారులు, యువకులు తిరిగి గల్ఫ్‌బాట పట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో వడ్రంగి కొడిమోజు దేవేందరే ఉదాహరణ. ఏడేండ్లుగా చేతినిండా వృత్తి పనితో సంతోషంగా గడిపిన దేవేందర్‌కు భార్య లహరి, ఇద్దరు పిల్లలు సాత్విక్, సుచిత్ ఉన్నారు. పిల్లలను ఉన్నంతలో ఓ ప్రైవేటు పాఠశాలలో చదివిస్తూ ఉన్న ఊళ్లో సంతోషంగా బతకాలని కలలుగన్నాడు. ఇంతలో వ్యవసాయం ప్రశ్నార్థకంగా మార డం.. రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గుముఖం పట్టడం.. ఫలితంగా నిర్మాణ రంగం ఆగమైంది.
దీనికితోడు ఇసుకపై విపరీతమైన ఆంక్షలు విధించడంతో ఇండ్ల నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఆరు నెలలుగా పనిలేక ఇబ్బందులు పడుతున్నాడు. అద్దెకు తీసుకుని నడిపిస్తున్న కార్పెంటర్ షెడ్డుకు అద్దె చెల్లించడం, పిల్లల చదువులకు ఫీజులు కట్టడం, కుటుంబాన్ని పోషించడం తలకు మించిన భారంగా మారింది. 2006లో ఊళ్లో పనిలేక బహరాన్, 2015లో సౌదీలో గడిపిన దేవేందర్.. ఆ తర్వాత సొంత ఊళ్లో పని ఉన్నదని 2017లో స్వగ్రామానికి చేరుకున్నాడు. 7 సంవత్సరాలు సంతోషంగా గడిపాడు. మళ్లీ ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మస్కట్ బా ట పడుతున్నాడు. భార్యాపిల్లలను విడిచి వెళ్లాలని లేకపోయినా వెళ్లక తప్పడం లేదని దేవేందర్ ఆవేదనగా తెలిపాడు.