హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): అబద్ధాలు చెప్పడంలో, వాటిని ప్రచారం చేయడంలో బీజేపీని మించినవారు ఎవరూ లేరని మంత్రి కేటీఆర్ శుక్రవారం మీడియా చిట్‌చాట్‌లో అన్నారు. బీజేపీ చెప్పిన విషయాలనే తాము ప్రజల్లో చర్చకు పెడుతామని, వారు చేసిందేమిటని నిలదీస్తామని పేర్కొన్నారు. ‘గోల్మాల్ గుజరాత్ మాడల్‌లో ఏముందో చెప్తాం.. వారి నిజస్వరూపం బయటపెడతాం. వాళ్లు చెప్తున్న వికాసం, అభివృద్ధి ఎక్కడున్నది? వారు చెప్పిన అచ్చేదిన్ ఎక్కడున్నాయి? రైతుల ఆదాయం రెట్టింపు ఎక్కడయ్యింది? పేదల జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? ఇవేమీ జరగలేదని ప్రజలకు వివరించి చెప్తాం’ అని అన్నారు. అదే సమయంలో తాము బీఆర్ఎస్ తరఫున ఇతర రాష్ర్టాల్లో ప్రచారానికి వెళ్లినప్పుడు తెలంగాణలో ఏం చేశామో కూడా చెప్తామన్నారు. తెలంగాణ చిన్న రాష్ట్రమైనా అనేక సవాళ్లను అధిగమించి అభివృద్ధి సాధించి చూపిందని, అసలేమీ లేకపోయినా ఏదో చేశామని చెప్పుకుంటున్న గోల్మాల్ గుజరాత్‌కన్నా తెలంగాణలో నిఖార్సయిన అభివృద్ధి జరిగిందని చెప్పారు. దానినే తాము ప్రచారం చేస్తామని తెలిపారు. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా విస్తృతంగా ఉన్న ఈ కాలంలో తెలంగాణలో ఏం జరుగుతున్నదో ప్రజలకు చెప్పడం చాలా సులువని పేర్కొన్నారు. దేశంలోని 28 రాష్ట్రాలకు చెందిన రైతులు, రైతు నాయకులు ఇటీవల తెలంగాణకు వచ్చి ఇక్కడ రైతుల కోసం ప్రభుత్వం చేపట్టిన పథకాలు, కార్యక్రమాలను చూసి ఆశ్చర్యపోయారని అన్నారు.
తెలంగాణలో చేరతామంటున్నారు
ఓ బహిరంగ సభలో కర్ణాటక మంత్రి సమక్షంలోనే రాయిచూర్ బీజేపీ ఎమ్మెల్యే తమకు తెలంగాణ పథకాలనైనా అమలు చేయండి లేదా తమను తెలంగాణలో అయినా కలపండి అని డిమాండ్ చేశారని మంత్రి కేటీఆర్ తెలిపారు. అలాగే హైదరాబాద్ రాజ్యంలోని పర్భణీ, నాందేడ్, ఔరంగాబాద్ తదితర జిల్లాల నుంచి సర్పంచ్‌లు తమను తెలంగాణలో కలపాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి వినతి పత్రం ఇచ్చారని గుర్తుచేశారు.
ఉత్తర, దక్షిణ తేడా ఏమీ ఉండదు
దక్షిణభారత నాయకత్వాన్ని ఉత్తర భారతదేశం అంగీకరించదు అనేది తప్పుడు వాదన అని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘కేసీఆర్ పార్టీ పెట్టినపుడు ఆయన మెదక్ జిల్లాకు పరిమితమైన నాయకుడు. నల్లగొండ, మహబూబ్‌నగర్ వాళ్లు సమ్మతిస్తరా? అని అనుమానపడ్డారు. అలాగే ఇప్పుడు కేసీఆర్‌ను దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా, అత్యుత్తమ మాడల్‌గా తెలంగాణను తీర్చిదిద్దిన నాయకుడిగా గుర్తిస్తారు. 1977 తరువాత దేశంలో జనతాపార్టీ జాతి దృష్టిని ఆకర్శించినట్టే, 1987-89లో వీపీ సింగ్ రూపంలో ఒక సంచనలం వచ్చినట్టే ఇప్పడూ జరుగుతుంది’ అని అన్నారు.
తెలంగాణ మాడల్ దేశానికి అవసరం
తెలంగాణ మాడల్ దేశానికి అవసరమని తాము బలంగా విశ్వసిస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, మిషన్ భగీరథ, రైతుబంధు, బీమా, దళితబంధు వంటి విధానాలు దేశవ్యాప్తంగా ఎందుకు అమ లు కాకూడదని ప్రశ్నించారు. ‘తలసరి ఆదాయం, జీఎస్డీపీ, వ్యవసాయ ఉత్పాదక పెరుగుదల, 240 శాతం పెరిగిన ఐటీ ఎగుమతులు, పల్లెప్రగతి, పట్టణ ప్రగతి.. ఇలా అన్ని రంగా ల్లో దేశంలోనే తెలంగాణ టాప్‌లో ఉన్నది. ఇదే సమయంలో కేంద్రం ప్రతీ రంగంలో విఫలమైంది’ అని విమర్శించారు.
కాంగ్రెస్ ఓ డిజాస్టర్
దేశానికి భారంగా మారింది
కాంగ్రెస్, బీజేపీ రెండింటిపై పోరాడుతాం మంత్రి కేటీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): తమ పోరాటం బీజేపీపై మాత్రమే కాదని, కాంగ్రెస్‌పైనా ఉంటుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తాము బీజేపీకి వ్యతిరేకం కాబట్టి వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న పక్షంతో చేతులు కలుపుతారన్న ఆలోచన సరికాదని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం తమ ప్రధాన ప్రత్యర్థి బీజేపీ అని తెలిపారు. కాంగ్రెస్‌ను దేశంలో ఎవరూ పట్టించుకోవడంలేదని ఎద్దేవా చేశారు. ‘కాంగ్రెస్ ఓ డిజాస్టర్. దేశానికి భారం. అధికారం పొందడం అటుంచితే కనీసం పోటీచేసే స్థితిలో కూడా అది లేదు. ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ అమేథీలో ఓడిపోయారు. రాహుల్ ఒక వైపు భారత్ జోడో అంటూ పాదయాత్ర చేస్తుంటే.. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ‘చోడో’ అంటూ ఆ పార్టీని వీడుతున్నారు. ఆ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జోక్‌లా మారాయి. 76 ఏండ్ల సోనియాగాంధీ పక్కకు తప్పుకోవడం, 80 ఏండ్ల మల్లికార్జున ఖర్గే పోటీలో ఉండటమే ఇందుకు నిదర్శనం’ అని విమర్శించారు.
నాకు క్రెడిట్ ఇవ్వరా?
ఐ-ప్యాక్, టీఆర్ఎస్లోని ఇతర సోషల్ మీడియా విభాగాలు టీఆర్ఎస్కు సప్లిమెంటరీ వంటివని, మనలో కంటెంట్, సబ్జెక్ట్ లేకపోతే ఎవరూ రక్షించలేరని కేటీఆర్ అన్నారు. మనలో దమ్ముంటే సోషల్ మీడి యా ఏజన్సీలు ప్లస్ అవుతాయని, దమ్ములేకున్నా ఏజన్సీలు మాత్ర మే గెలిపించలేవన్నారు. ‘నేను సోషల్ మీడియాలో ఏదైనా పోస్టు పెడితే చాలు ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ అంటున్నారు. నాకు తెలియదా.. నాకు క్రెడిట్ ఇవ్వరా?’ అని ప్రశ్నించారు.
రైతు ఆత్మహత్యలు తగ్గాయని కేంద్రమే చెప్పింది
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని పార్లమెంట్ సాక్షిగా కేంద్రమే తెలిపిందని కేటీఆర్ గుర్తుచేశారు. ఇప్పుడు తెలంగాణ రైతులు పంజాబ్, హర్యానా రైతులతో పోటీపడేస్థాయికి ఎదిగారని చెప్పారు. రైతుబంధు పథకం కేంద్రంతోపాటు 13 రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ఒడిశా చేనేత, జౌళి శాఖమంత్రి రీటా సాహూ రైతుబంధు స్ఫూర్తితో ‘కాలియా’ పథకాన్ని తెచ్చామని చెప్పారని, అలాగే కృషిబంధు పేరుతో పశ్చిమ బెంగాల్లో పథకాన్ని అమలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ వివరించారు.
బీజేపీ నేతలు సత్యహరిశ్చంద్రుని బామ్మర్దులా?
టీఆర్ఎస్ పెట్టినప్పుడు ఏ విధంగా కుట్రలు చేశారో బీఆర్ఎస్ ప్రయాణాన్ని అడ్డుకోవడానికి కూడా కుట్రలు చేస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. వాటిని ఎదుర్కొనే శక్తి తమకు ఉన్నదని తెలిపారు. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి వేట కుక్కలను ఉసిగొల్పటం వంటి అనేక ట్రిక్కులు ప్లే చేస్తారని, అన్నింటినీ ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. బీజేపీలో ఉన్నవాళ్లందరూ సత్యహరిశ్చంద్రుని బామ్మర్దులు..దేశంలోని మిగితా పార్టీల్లోని నేతలు అవినీతిపరులా? అని నిలదీశారు.
ఒక వ్యక్తే ధనవంతుడయ్యారు
8 ఏండ్లలో తెలంగాణ సాధించిన ప్రగతిని, చేసిన మంచిపనులను గంటసేపు గుక్కతిప్పుకోకుండా తాను చెప్పగలనని, ఇదే కాలంలో దేశానికి మోదీ ఏం చేశారో చెప్పగలరా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. 45 ఏండ్లల్లో అత్యధిక నిరుద్యోగిత రేటు, 30 ఏండ్లల్లో అత్యధిక ద్రవ్యోల్బణం, అత్యధిక గ్యాస్ ధరలు, నైజీరియాను మించిన పేదరికం.. ఇవీ మోదీ ఘనత అని అన్నారు. 2014లో చెప్పిన వికాసం, అచ్చేదిన్ ఎపుడు వస్తాయో చెప్పాలన్నారు. అచ్చేదిన్ ప్రజలకు రాలేదని, ఒక వ్యక్తి మాత్రం ప్రపంచంలోనే అత్యంత ధనికుడయ్యాడని ఎద్దేవా చేశారు. దేశంలో అందరికీ ఇండ్లు కట్టిస్తానన్న మోదీ.. రూ.435 కోట్లతో కొత్త ఇల్లును కట్టుకుంటున్నారని విమర్శించారు. దేశంలో పేదలు అత్యంత నిరుపేదలుగా మారుతున్నారని, 1 శాతం మంది మాత్రం ధనవంతులు అవుతున్నారని వివరించారు.