తాడ్వాయి, జనవరి 14 : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో బుధవారం సమ్మక్క-సారక్క పూజారులు గుడిమెలిగే పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ నెల 28 నుంచి 31 వరకు అమ్మవార్ల మహాజాతర జరుగనున్న నేపథ్యంలో రెండు వారాల ముందు నుంచి నిర్వహించే గుడిమెలిగే పండుగతో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయి. మేడారంలో సమ్మక్క పూజారులు, కన్నెపల్లిలో సారక్క పూజారులు కాక సారయ్య, కాక కిరణ్ పూజా మందిరాలకు చేరుకుని శుద్ధి చేశారు.
మేడారంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో డోలివాయిద్యాల నడుమ సమీప అటవీ ప్రాంతంలోని గుట్టపైకి వెళ్లి గడ్డిని, పుట్ట మట్టిని సేకరించారు. అనంతరం సమ్మక్క పూజా మందిరం వద్దకు చేరుకొని గుడిపై గడ్డిని వేసిన అనంతరం ఆడపడుచులు పూజా మందిరాల్లోని గద్దెలను మట్టితో అలుకుపూతలు నిర్వహించి ముగ్గులు వేశారు. అమ్మవారి పూజా సామగ్రిని సమ్మక్క దేవత పూజారి కొక్కెర కృష్ణయ్య భద్రపరిచిన స్థలం నుంచి తీసుకువచ్చి శుద్ధిచేశారు.