హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): చేనేత ఉత్పత్తులపై కేంద్రం విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని రాష్ట్రంలోని పలు చేనేత సహకార సంఘాల అధ్యక్ష, కార్యవర్గసభ్యులు డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ విధించలేదని, ఆ ఖ్యాతి మోదీ సర్కారుకే దక్కిందని ఎద్దేవా చేశారు. కరీంనగర్, నారాయణపేట జిల్లాల చేనేత సహకార సంఘాల అధ్యక్షులు సత్యనారాయణ, ఆంజనేయులు, మునుగోడు చేనేత సహకార సంఘం డైరెక్టర్ భాస్కర్, కరీంనగర్ చేనేత సమాఖ్య అధ్యక్షుడు రామచంద్రం, గుండాల వీవర్స్ సొసైటీ అధ్యక్షులు ఉప్పలయ్య, బాలరాజు తదితరులు బుధవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు మొదలుపెట్టిందని, ఇందులో భాగంగా మొదలు 12శాతం జీఎస్టీ విధించి, 5 శాతానికి కుదించినట్టు చెప్పారు. గుజరాత్లో అధికంగా వినియోగంలో ఉన్న పవర్లూమ్పై పన్నును 18 శాతం నుంచి 12 శాతానికి కుదించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా చేనేత వస్త్ర వ్యాపారం రూ.60 వేల కోట్లు కాగా, ప్రభుత్వానికి సుమారు రూ.3 వేల కోట్ల ఆదాయం సమకూరుతున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి శుష్క వాగ్దానాలు-రిక్తహస్తాలు అన్నట్టు తయారయ్యిందని ధ్వజమెత్తారు. కేంద్రం నిర్లక్ష్యం వల్ల నూలు ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, దీంతో వస్ర్తాల ధరలు విపరీతంగా పెరిగినట్టు చెప్పారు. మోదీ సర్కారు రద్దు చేసిన పథకాలు, ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పథకాల వివరాలను నేత సంఘాల సభ్యులు మీడియాకు వివరించారు.
టీఆర్ఎస్ లీగల్‌సెల్ ఆధ్వర్యంలో పోస్టుకార్డులు
కవాడిగూడ, అక్టోబర్ 26: చేనేత ఉత్పత్తులపై కేంద్రం విధించిన 5 శాతం జీఎస్టీని రద్దు చేయాలంటూ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ లీగల్ సెల్ విభాగం కేంద్రానికి పోస్టుకార్డులు రాసింది. చేనేత రంగానికి మరణశాసనం లాంటి జీఎస్టీని రద్దు చేయాలని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్‌రెడ్డి, టీఆర్ఎస్ లీగల్ సెల్ నాయకులు కొంతం గోవర్ధన్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, ఉపేందర్, రవికుమార్, జగదీశ్, అశోక్, అరవిందరావు డిమాండ్ చేశారు.
కేంద్రం రద్దు చేసిన పథకాలు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు