Gruha Lakshmi | హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): ఈ నెల 20వ తేదీలోగా గృహలక్ష్మి పథకం మొదటిదశ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తిచేసి లబ్ధిదారుల జాబితాను ప్రకటించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. 10వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులకు మొదటి విడతలో అవకాశం కల్పిస్తారు.
పదో తేదీ తరువాత వచ్చిన దరఖాస్తులను రెండోవిడతలో పరిశీలించాలని నిర్ణయించారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో దరఖాస్తులను పరిశీలించి అర్హులను ఎంపికచేస్తారు. జిల్లా మంత్రి ఆమోదంతో లబ్ధిదారుల జాబితాను సిద్ధంచేస్తారు. కొన్ని జిల్లాల్లో 15వ తేదీలోగా దరఖాస్తుల ప్రక్రియ పూర్తిచేసి లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని స్థానిక ప్రజాప్రతినిధులు కోరుతుండగా, ఇందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.