Bhatti Vikramarka | హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): ఆరు గ్యారెంటీల్లో భాగంగా ప్రభు త్వం అమలుచేస్తున్న గృహజ్యోతి పథకంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరింత స్పష్టతనిచ్చారు. ఒక రేషన్ కార్డుపై ఒక్కరికే ఇది వర్తిస్తుందని, 200 యూనిట్లలోపు విద్యుత్తును వాడుకున్న వారికే ఈ పథకం వర్తిస్తుందని, అంతకంటే ఒక్క యూనిట్ ఎ క్కువొచ్చినా వర్తించదని స్పష్టం చేశారు. శనివారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. 200 యూనిట్ల లోపున్నా బిల్లులు ఇస్తున్నారన్న విలేకరుల ప్రశ్నకు భట్టి స్పందిస్తూ అలా వచ్చినవారు బిల్లు కట్టాల్సిన పనిలేదని పేర్కొన్నారు. రేషన్‌కార్డు, సర్వీస్ నంబర్, ఆధార్‌కార్డును ప్రజాపాలన అధికారికి అప్పగిస్తే ఆటోమెటిక్‌గా జీరో బిల్లు వస్తుందని వివరించారు. గృహజ్యోతి పథకంలో రాష్ట్రవ్యాప్తంగా 40,33,702 మందికి జీరో బిల్లులిచ్చినట్టు తెలిపారు. వ్య వసాయ మోటర్లకు మీటర్లు బిగించబోమని చెప్పారు.
రాళ్లు, రప్పలు, కొండలు, గుట్టలున్న భూముల సమాచారం తమవద్ద లేదని, ఈసారికి వాటికి కూడా రైతుభరోసా నిధులు జమచేస్తున్న ట్టు తెలిపారు. ఇప్పటి వరకు మూడెకరాల లోపు ఉన్న రైతులకు నిధులు వేశామని, ప్రస్తుతం నాలుగెకరాలు ఉన్న రైతులకు నిధులు జమచేస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే ఐదెకరాల రైతులకు నిధులు పంపిణీ చేస్తామన్నారు. గత ప్రభుత్వం కొండలు, గుట్టలున్న బడాబాబులకు రైతుబంధు నిధులు జమచేసి రూ.20 వేల కోట్లను దుర్వినియోగం చేసిందన్న వ్యాఖ్యలను గుర్తుచేసిన విలేకరులకు మంత్రి భట్టి పైవిధం గా సమాధానం ఇచ్చారు.
మహిళా పారిశ్రామికవేత్తలను తయారుచేసేందుకు త్వరలోనే మైక్రోస్మాల్ ఇండస్ట్రీ పార్కులను ప్రారంభిస్తామని మంత్రి భట్టి తెలిపారు. 12న వడ్డీలేని రుణ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఈ ఏడాది విద్యుత్తు వినియోగం రికార్డుస్థాయిలో పెరిగిందని, మార్చి 8న 15,623 మెగావాట్ల విద్యుత్తు వినియోగమైనట్టు చెప్పారు. నిరుడు అదే రోజున 15,497 మెగావాట్లు వినియోగమై, ఇప్పుడా రికార్డు బద్దలైందని తెలిపారు. 16,500 మెగావాట్ల విద్యుత్తును సరఫరా చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని, కాబట్టి ప్రజలు నిశ్చింతగా ఉండాలని కోరారు. త్వరలోనే పవర్ పాలసీ ప్రకటిస్తామని పేర్కొన్నారు. ప్రెస్మీట్లో ఇంధనశాఖ కార్యదర్శి, టీఎస్ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ, టీఎస్ జెన్కో జేఎండీ కృష్ణభాస్కర్, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూకీ పాల్గొన్నారు.