2014కు ముందు.. రాష్ట్రంలో ఎఫ్సీఐ నేరుగా ధాన్యం కొనేది. అప్పుడు మిల్ లెవీ విధానం అమల్లో ఉండేది. ఎఫ్సీఐకి, మిల్లర్లకు మధ్యే ఆ ఒప్పందం. అంటే.. రాష్ట్రప్రభుత్వాలకు
సంబంధమే లేదు.మోదీ సర్కారు వచ్చాక.. డీ సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ విధానం తెచ్చింది. ధాన్యం కొనే బాధ్యతను రాష్ర్టాలపైకి నెట్టేసింది. ఇప్పుడేమో బియ్యమే కొనబోమని మొండికేస్తూ, రాష్ర్టాలను బదనాం చేయాలని కుట్ర చేస్తున్నది.రా రైస్, బాయిల్డ్ రైస్ పద్ధతిని అమల్లోకి తెచ్చిందే కేంద్రం. ఇప్పుడేమో బాయిల్డ్ రైస్ కొనం అంటూ తప్పించుకొంటున్నది. దీన్ని బట్టే అర్థమవుతున్నది.. కేంద్రం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదో.. ఏ స్థాయిలో రాష్ర్టాలను బలి చేయాలని చూస్తున్నదో!!
హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు తన బాధ్యతగా ఉన్న బియ్యం కొనుగోళ్లను క్రమంగా రాష్ర్టాలపైకి నెట్టేసిన కేం ద్రం.. ఇప్పుడు కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలను దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నది. వాస్తవానికి ధాన్యం కొనుగోళ్లలో రాష్ర్టాలు కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నాయి. కానీ.. సాయం చేస్తున్న రాష్ర్టాలకే సున్నం పెట్టాలని కేంద్రం చూస్తున్నది. ధాన్యం కొనుగోళ్లకు గతంలో ఒక విధానం అమల్లో ఉంటే, ప్రస్తుతం మరొకటి ఉన్నది. కేంద్రం, ఎఫ్సీఐ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి మిల్లెవీ విధానాన్ని ఎత్తేసి, బియ్యం సేకరణ బాధ్యతల నుంచి తప్పుకొని, రాష్ర్టాలపై భారం పెట్టాయి. ధాన్యం కొనుగోళ్లు భారం అని తెలిసినా, రైతుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానానికి అంగీకరించింది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతులకు నష్టం కలుగకుండా ధాన్యం సేకరిస్తున్నది. సకాలంలో డబ్బులూ చెల్లిస్తున్నది. సేకరించిన ధాన్యాన్ని ఎఫ్సీఐకి అప్పగిస్తున్నది. కానీ తన బాధ్యతల నుంచి తప్పుకొన్న కేంద్రం.. ధాన్యం కొనుగోలు విషయంలో, సీఎంఆర్ అందించటంలో రాష్ర్టాలపై అసత్య ఆరోపణలు చేస్తున్నది. పైగా, ధాన్యం కొనం, బాయిల్డ్ చేస్తే తీసుకోం అంటూ బుకాయిస్తున్నది. రైతుల మేలు కోసం భారాన్ని తలతెత్తుకొన్న రాష్ర్టాలపై నిందలు వేస్తున్నది.
బాయిల్డ్ రైస్ సృష్టికర్తే ఎఫ్సీఐ
నిజానికి బియ్యం సేకరించే బాధ్యత ఎఫ్సీఐది. రా రైసా? బాయిల్డ్ రైసా? అన్నది రాష్ర్టాలకు సంబంధం లేని అంశం. అసలు రా రైస్, బాయిల్డ్ రైస్ అన్న పదాలను సృష్టించిందే ఎఫ్సీఐ. గతంలో రా రైస్ వద్దన్న ఎఫ్సీఐ, ఇప్పుడు బాయిల్డ్ రైస్ వద్దని అంటుండటం కేంద్రం తీరేంటో చెప్పకనే చెప్తున్నది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరిస్తున్నది కాబట్టి బాయిల్డ్ రైస్ వద్దంటూ కేంద్రం మొండికేస్తున్నది. గతంలో మాదిరి నేరుగా ఎఫ్సీఐ కొనుగోలు చేస్తే ఇలాంటి షరతులు పెట్టేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏ విధమైన బియ్యం కావాలో అందుకు అనుగుణంగా లాభనష్టాలను భరించి సేకరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుంది. అలా కాకుండా తన బాధ్యతను, తన తప్పును ఇలా రాష్ట్రంపై నెట్టడం ఏంటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సేకరించిన ధాన్యం నుంచి రా రైస్ చేసుకొంటారో, బాయిల్డ్ రైస్ చేసుకొంటారో వాళ్ల ఇష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా.. ధాన్యం కొనుగోలు ఆర్థిక భారంగా మారుతున్నదని, ఇకపై కొనుగోలు చేయలేమని తెలియజేస్తూ ఒడిశా పౌరసరఫరాల సంస్థ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. తెలంగాణ సర్కారు మాత్రం రైతుల సంక్షేమం కోసం ఆ ఇబ్బందులన్నీ ఎదుర్కొంటూ ధాన్యాన్ని కొంటున్నది.
రాష్ర్టాలకు పెనుభారం
ధాన్యం సేకరణ బాధ్యతను ఎఫ్సీఐ రాష్ర్టాలపై మోపడంతో రాష్ట్ర ప్రభుత్వాలకు తలకు మించిన భారంగా పరిణమించింది. నిధుల సేకరణ, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఇబ్బందిగా మారింది. ధాన్యం సేకరణ కోసం ఏటా వేల కోట్ల రూపాయల నష్టాన్ని మూటగట్టుకోవాల్సి వస్తున్నది. ధాన్యం సేకరణ సమయంలో రైతులకు డబ్బులు చెల్లించేందుకు తెలంగాణ సర్కారు ప్రతి సీజన్లో సుమారు రూ.15 వేల కోట్లకు పైగా బ్యాంకు రుణాలు తీసుకొంటున్నది. ఇందుకు కేంద్రం రెండు నెలల వడ్డీనే ఇస్తున్నది. మిగిలిన ఆరేడు నెలల వడ్డీని రాష్ర్టాలే భరిస్తున్నాయి. సౌకర్యాల కల్పన, ఇతర అవసరాలకు కూడా భారీగానే ఖర్చు చేయాల్సి వస్తున్నది. దీంతో రాష్ర్టాల పౌరసరఫరాల సంస్థలు నష్టాలను మూటగట్టుకొంటున్నాయి.
ఆ లాభం మీరే తీసుకోండి మరి
తెలంగాణ ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కైందని, రైతుల నుంచి తక్కువ ధాన్యం కొనుగోలు చేసి ఎఫ్సీఐకి ఎక్కువ ధాన్యం సేకరించినట్టు చూపిస్తున్నదంటూ వాట్సాప్ యూనివర్సిటీలో బీజేపీ అసత్య ప్రచారానికి దిగుతున్నది. ధాన్యం సేకరణ వల్ల ఇటు మిల్లర్లు, అటు ప్రభుత్వం భారీగా లాభపడుతున్నదనేలా ప్రచారం చేశారు. మరి రాష్ర్టాల బదులు ధాన్యాన్ని నేరుగా ఎఫ్సీఐ సేకరిస్తే ఆ లాభం కేంద్రమే పొందొచ్చు కదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎంత ధాన్యానికి ఎంత బియ్యం వస్తుందనే విషయాన్ని ప్రయోగాత్మకంగా లెక్కించిన తర్వాతే కేంద్రం సీఎంఆర్ విధానాన్ని అమలు చేసింది. అంటే ఎంత ధాన్యానికి ఎంత బియ్యం ఇవ్వాలో తేల్చింది. అంతకన్నా ఎక్కువ బియ్యం వస్తుంటే కేంద్రంగానీ, ఎఫ్సీఐ గానీ ఎందుకు చూస్తూ ఊరుకొంటాయి? ఈ మాత్రం ఆలోచన లేకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయటమే లక్ష్యంగా బీజేపీ నేతలు అర్థంపర్థం లేని విమర్శలు చేస్తున్నారని పలువురు మండిపడుతున్నారు.