ఖమ్మం, మే 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం జిల్లా రాజకీయ చరిత్రలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక బచ్చా అని రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. సోమవారం ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో 91 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. ఖమ్మం నగరం హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చెందిందని, కండ్లుండి కూడా పొంగులేటి అభివృద్ధిని చూడలేకపోతున్నాడని మండిపడ్డారు. నగరాభివృద్ధిపై కడుపు నిండా విషం పెట్టుకున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అండదండలతోనే పొంగులేటి ఎదిగారని తెలిపారు.
నిన్నమొన్నటి వరకు గులాబీ జెండా కింద బతికి ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ను విమర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పొంగులేటి వద్ద పాపపు సొమ్ము పేరుకుపోయిందని అన్నారు. కాంట్రాక్టర్‌గా ఎన్నో కాలువల నిర్మాణాలు పూర్తి చేయకుండానే వందల కోట్ల రూపాయలను కొల్లగొట్టారని ఆరోపించారు. పొంగులేటి ఆగడాలపై తన పాలోడే ఫిర్యాదు చేసిన సంగతి గుర్తులేదా? అని ప్రశ్నించారు. చిన్న కాంట్రాక్టర్లు త్వరలోనే పొంగులేటి మోసాల చిట్టాను బయటపెట్టనున్నారని తెలిపారు. పొంగులేటి పక్కన తిరిగే వారంతా దొంగలు, రౌడీషీటర్లేనని అన్నారు. కార్యక్రమంలో మేయర్ నీరజ, సుడా చైర్మన్ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.