కాళేశ్వరం/మహదేవపూర్, జూన్ 4: కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం (సరస్వతీ) బరాజ్‌లో గ్రౌటింగ్ పనులు ప్రారంభమయ్యాయి. బరాజ్‌లో డౌన్ స్ట్రీమ్‌లోని 38వ పిల్లర్ గేట్ వద్ద జరుగుతున్న పనులు వర్షం కారణంగా సోమవారం ఆగిపోయాయి. మంగళవారం వర్షం లేకపోవడంతో పనులు మొదలుపెట్టారు. నీరు లీకు కాకుండా ఉన్నంత వరకు పనులు చేయనున్నట్టు ఇంజినీర్లు తెలిపారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌లో మరమ్మతు పనులు జరుగుతున్నాయి. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచనల మేరకు బరాజ్‌లో కుంగిన 19, 20, 21వ పియర్ల వద్ద అప్, డౌన్ స్ట్రీమ్‌లలో పనులు చేస్తున్నారు. మంగళవారం భారీ నీటిపారుదల శాఖ ఈఈ తిరుపతి రావు ఈ పనులను పరిశీలించారు. బరాజ్ ఏడో బ్లాక్‌లోని 18, 19వ పిల్లర్ల వద్ద ఏర్పడ్డ ఖాళీ ప్రదేశాలను సిమెంట్, ఇసుక మిశ్రమంతో కెమికల్ గ్రౌటింగ్ పనులు చేపడుతున్నారు. 15,16వ పిల్లర్ల దిగువన ఇసుకలో కాపర్ షీట్ ఫైల్స్‌ను అమర్చుతున్నారు. 20, 21వ గేట్ల కటింగ్, డౌన్ స్ట్రీమ్‌లో క్రేన్ల సాయంతో సీసీ బ్లాక్‌లను తీసి అమర్చుతున్నారు.