Group-2 Exam | రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో గ్రూప్-2 ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే పరీక్ష నవంబర్ నెలకు వాయిదా పడింది. లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నందున, వారికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శనివారం ఆదేశించారు.
ఈ విషయమై టీఎస్పీఎస్సీతో చర్చించాలని, రీ షెడ్యూలింగ్‌కు చర్యలు తీసుకోవాలని శాంతి కుమారికి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగాల భర్తీకి భవిష్యత్‌లో జారీ చేసే నోటిఫికేషన్ల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి.. టీఎస్పీఎస్సీ చైర్మన్, కార్యదర్శిలతో చర్చించారు. గ్రూప్-2 పరీక్షను నవంబర్‌కు వాయిదా వేయాలని నిర్ణయించారు.
గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలనే విషయమై సీఎస్‌తో సీఎం కేసీఆర్ చర్చించారని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘గ్రూప్-2 పరీక్ష రీషెడ్యూల్ గురించి సీఎస్‌తో సీఎం కేసీఆర్ చర్చించారు. రీ షెడ్యూల్ విషయమై టీఎస్పీఎస్సీతో చర్చించాలని సీఎస్‌ను ఆదేశించారు. లక్షల మంది విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశించారు. అంతే కాక, భవిష్యత్‌లోనూ ఉద్యోగాల నియామకాలకు విడుదల చేసే నోటిఫికేషన్ల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి అభ్యర్థికి పరీక్షకు హాజరయ్యేందుకు సన్నద్ధమయ్యేందుకు సరిపడా సమయం లభించేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ ను ఆదేశించారు’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.